Templates by BIGtheme NET
Home >> Telugu News >> చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై ముదురుతున్న రగడ

చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై ముదురుతున్న రగడ


తెలంగాణ సీఎం కేసీఆర్ తో విభేదాలు పొడచూపాక ఇన్నాళ్లూ ఎలాంటి వివాదాలు లేని చినజీయర్ స్వామికి కొత్త కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. అవి ప్రత్యర్థులు చేస్తున్నారో.. లేక కేసీఆర్ అభిమానులో కానీ మొత్తానికి కొత్త కొత్త వివాదాల్లో చినజీయర్ స్వామి చిక్కుకుంటున్నారు.

సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ చేత ఆవిష్కరింపచేయడం.. ఆ తర్వాత కేసీఆర్ పేరు శిలాఫలకం మీద లేకపోవడంతో విభేదాలు తలెత్తాయని బాగా ప్రచారం సాగింది. ఇప్పటివరకూ ఎన్నోసార్లు మాట్లాడినా కానీ కేసీఆర్ తో సాన్నిహిత్యం వల్ల చినజీయర్ స్వామిపై వ్యతిరేక రాలేదు.
ఎవరూ నోరెత్తలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాత వీడియోలన్నీ తీసి.. చినజీయర్ మాట్లాడిన వివాదాస్పద వీడియోలను వైరల్ చేస్తూ ఎండగడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చినజీయర్ పై విమర్శలే వినిపిస్తున్నాయి.

గతంలో అప్పుడెప్పుడో మాటీవీలో ప్రవచనాలు చెప్పారు చినజీయర్ స్వామి ఆ సందర్భంగా తెలంగాణ గిరిజన దేవతలైన ‘సమ్మక్క-సారక్క’ జాతర గురించి అనుచిత వ్యాఖ్యలుచేశారు.

‘వాళ్లేమైనా దేవతలా? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చిన వాళ్లా? ఏమిటీ చరిత్ర? ఏదో ఒక అడవి దేవత.. గ్రామ దేవత.. అక్కడుండేవాళ్లు చేసుకోనీ.. చదువుకున్న వాళ్లు పెద్దపెద్ద వ్యాపారస్తులు.. ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ.. ఇప్పుడు ఇది వ్యాపారమైంది? ఎంత అన్యాయం.. అది ఒక చెడు.. కావాలనే దీన్ని వ్యాపింపచేస్తున్నారు సమాజంలో.. ‘అంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గిరిజన ఆరాధ్య దేవతలైన సమ్మక్క సారలమ్మలను తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు ఎంతో మంది విశ్వసిస్తారు. చినజీయర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిలికిచిలికి గాలివానగా మారాయి. సమ్మక్క-సారలమ్మ జాతరను చినజీయర్ కించపరిచాడని ఆదివాసీ గిరిజన సంఘాలు ఇప్పటికే చిన్న జీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర ఐన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేడారంలో చినజీయర్ దిష్టిబొమ్మను తాజాగా దగ్ధం చేశారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు చిలికిచిలికి గాలివానగా మారుతోంది.