జగన్‌ సర్కార్‌ ఆర్టీసీని అలా ఉద్ధరించేస్తోంది.!

0

‘బస్సు చక్రం – ప్రగతికి చిహ్నం’ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ.. దేశంలోనే అత్యున్నత ప్రజా రవాణా వ్యవస్థగా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక ఆర్టీసీ వివాదాల్లోకెక్కింది.. ఎలాగోలా ఆ వివాదాలు కొంతమేర సద్దుమణిగినా, ఆస్తుల పంపకంలో ఇంకా ఆనాటి వివాదాల తాలూకు ‘మరకలు’ కనిపిస్తూనే వున్నాయి.

తెలంగాణలో ఆర్టీసీ ఒకానొక దశలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అంతలోనే వివాదం చల్లారింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసేయడం.. ఆ వ్యవహారం చుట్టూ పెద్దయెత్తున పబ్లిసిటీ స్టంట్లు నడవడం చూశాం. సరిగ్గా ఈ టైంలోనే కరోనా మహమ్మారి దూసుకొచ్చింది.. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి.

కరోనా ప్రభావం తగ్గినా, తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు నడవడానికి చాలా రోజులు, నెలల సమయం పట్టిందంటే.. అది ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమే. ఒప్పందాలు కుదిరాయ్‌గానీ.. ఆ ఒప్పందాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. కానీ, విధిలేని పరిస్థితి ఏర్పడింది గనుక.. ఆంధ్రప్రదేశ్‌ ఇక్కడికి ఈ వివాదాన్ని ‘మమ’ అన్పించిందని సరిపెట్టుకోవాల్సిందే. ఇదేనా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సాధించిన ఘనత ఆర్టీసీ విషయంలో.? అని సగటు ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణీకుడు ముక్కున వేలేసుకుంటున్నాడు.

అసలు, తెలంగాణతో వివాదం ఎందుకొచ్చింది.? సర్వీసుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముందు ఎందుకు మోకరిల్లాల్సి వచ్చింది.? అంటూ రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశ్నిస్తున్నారు. దసరా అతి పెద్ద సీజన్‌.. ఆర్టీసీకి సంబంధించి. సీజన్‌ ముగిశాక ఒప్పందాలు జరిగాయి. దీపావళి సీజన్‌ వున్నా.. అదేమంత గొప్ప సీజన్‌ కాదు.

సంక్రాంతి నాటికి పరిస్థితులు ఎలా వుంటాయో తెలియదు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సులకు లేని ఆంక్షలు, ఆర్టీసీ బస్సులకు ఎందుకొచ్చాయి.? అసలు ఈ మొత్తం కథ వెనుక నడిచిన అసలు ‘రాజకీయ కథ’ ఏంటి.? అనేదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ ప్రైవేటు బస్సుల్ని ఉద్ధరించే క్రమంలోనే ఆర్టీసీని నాశనం చేశారన్న విమర్శలు వినిపిస్తున్న విషయం విదితమే.