Templates by BIGtheme NET
Home >> Telugu News >> కేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు

కేంద్రానికి సుప్రీం షాక్.. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి బ్రేకులు


అత్యంత భారీగా.. అత్యాధునికంగా.. విశాలంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని వాయువేగంతో నిర్మించాలని భావిస్తున్న కేంద్రానికి బ్రేకులు వేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 10 ప్రధానమంత్రి మోడీ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తాజాగా ఒక పిల్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ ధర్మాసనం తాజాగా ఆదేశాలుజారీ చేసింది. కొత్త పార్లమెంటు భవనాన్ని ఇంత వేగంగా నిర్మించే నిర్ణయాన్ని తీసుకుంటారని తాము అనుకోలేదని సుప్రీం పేర్కొంది.

అంతేకాదు.. కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పార్లమెంటు భవనానికి కేవలం భూమిపూజ మాత్రమే చేయాలని.. నిర్మాణం లేదంటే కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ కేంద్రానికి సూచన చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్మాణం కానీ చెట్ల కూల్చివేతలు కానీ చేపట్టలేదన్నారు.

కొత్త భవనాలకు సంబంధించిన నమూనాల్ని రెండురోజుల క్రితమే కేంద్రం విడుదల చేసిందని.. అంతలోనే నిర్మాణానికి సంబంధించి ఇంత దూకుడుగా నిర్ణయాన్ని తీసుకుంటుందని తాము అనుకోలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2022 ఆగస్టు 15 నాటికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని ఈ కొత్త భవనంలో జరుపుకోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్లాన్ ఇప్పటికే ఆమోదం పొందింది. మొత్తం 64500 చదరపు మీటర్ల పరిధిలో ఉన్న ఈ భవనాన్ని భూకంపంతో పాటు.. ఇతర విపత్తులకు తట్టుకునేలా డిజైన్ చేశారు. టాటా నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రూ.971 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నెల 10న శంకుస్థాపన జరుగుతున్న వేళలోనే.. సుప్రీం నుంచి నిలుపుదల నిర్ణయం వెలువడటం గమనార్హం.