Templates by BIGtheme NET
Home >> Telugu News >> టీడీపీ మహానాడు అయితే అలా.. వైసీపీ ప్లీనరీ అయితే ఇలా..!

టీడీపీ మహానాడు అయితే అలా.. వైసీపీ ప్లీనరీ అయితే ఇలా..!


కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ విపక్షం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో.. వైసీపీ సర్కారు ఎలా రియాక్టు అయ్యిందో? ఆ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విపక్షం నిర్వహించిన మహానాడు ఎలా జరిగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఫోటోలు.. వీడియోలు చాలానే బయటకు వచ్చాయి.

తాజాగా విజయవాడ – గుంటూరు మధ్య నేషనల్ హైవేకి సమీపాన.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న సువిశాలమైన మైదానంలో ఈ రోజు.. రేపు (శుక్ర.. శని) ఏపీ అధికార పక్షం వైసీపీ ప్లీనరీ జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ పండక్కి పెద్ద ఎత్తున నేతలు.. పార్టీ అనుబంధ సంఘాలతో పాటు.. చోటా నేతలతో పాటు కార్యకర్తలు.. అభిమానులు పాల్గొనేందుకు వీలుగా ప్లీనరీని డిజైన్ చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీని పార్టీ మాత్రమే కాదు.. అధికారులు సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసేుకున్నట్లు చెబుతున్నారు.

ప్లీనరీ ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యన్నార్.. గుంటూరు రేంజ్ డీఐజీ తివిక్రమ్ వర్మ.. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా.. గుంటూరు ఎస్పీ అరిఫ్ హఫీజ్ బందోబస్తు.. ట్రాఫిక్ నియంత్రణతో సహా పలు అంశాల్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. వైసీపీ ప్లీనరీ కోసం దాదాపు 3500 మంది పోలీసుల్ని భద్రత విధుల కోసం నియమించటం గమనార్హం.

అంతేకాదు.. ప్లీనరీ కోసం 14 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతల్ని అప్పజెప్పారు. వీరే కాకుండా 30 మంది డీఎస్పీలు.. 120 మంది సీఐలు.. 170 మంది ఎస్ ఐలకు విధులు కేటాయించారు. వీరితో పాటు రిజర్వు ఫోర్సును సైతం సిద్ధం చేసి ఉంచారు.

వీటన్నింటితో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీకి హాజరు కావటానికి వీలుగా.. వేదికకు సమీపంలో హెలిప్యాడ్ ను సిద్ధం చేయటం గమనార్హం. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీకి హాజరు కావటానికి వీలుగా ప్రత్యేకంగా మార్గాన్ని సిద్ధం చేశారు.

ఇదే కాకుండా ప్లీనరీకి హాజరయ్యే వారిలో కేబినెట్ హోదాలో ఉన్న ప్రముఖులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లుగా గుర్తించి.. వారికి ప్రత్యేక పాసులు.. వాహన పాసుల్ని జారీ చేశారు.వారికి ప్రత్యేకమైన రూట్ ను సిద్ధం చేశారు. రాజు తలుచుకుంటూ దెబ్బలకు కొదవ అన్నట్లు.. అధికార పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీకి ఈ మాత్రం ఏర్పాట్లు చేయకుంటే ఏం బాగుంటుంది చెప్పండి?