Templates by BIGtheme NET
Home >> Telugu News >> మంత్రికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ … హైకోర్టు మెట్లు ఎక్కనున్న కొడాలి నాని !

మంత్రికి షాక్ ఇచ్చిన ఎస్ఈసీ … హైకోర్టు మెట్లు ఎక్కనున్న కొడాలి నాని !


ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానిపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. ఆయన పై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రెస్ మీట్ లతో పాటు ఎలాంటి మీటింగ్ లలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీచేసింది. మంత్రి కొడాలి నానిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఎస్పీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించింది. ఎస్ ఈ సీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరిన ఎన్నికల సంఘం.. ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనితో ఆ తర్వాత మంత్రి కొడాలి పై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

అంతకంటే ముందు … తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ ఈసీ చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ ఈసీ నిమ్మగడ్డ చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరన్నారు. వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పిచ్చి పెట్టిందని.. వారిని పరీక్షించి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చెర్పించి ట్రీట్ మెంట్ ఇవ్వాలని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఎస్ ఈ సీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్ ఈసీ ఇచ్చిన నోటీసులపై స్పందించిన మంత్రి కొడాలి నాని తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని అన్నారు.

రాజ్యాంగ బద్ధ సంస్థలపై తనకు నమ్మకం ఉందని ముఖ్యంరా ఎన్నికల కమిషన్ అంటే గౌరవముందన్నారు. తన వ్యాఖ్యల్లోని నిజమైన భావాన్ని ఎస్ ఈసీ అర్ధం చేసుకోలేదన్న మంత్రి కొడాలి నాని మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు రేషన్ డోర్ డెలివరీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించడానికే మీడియాతో మాట్లాడానే తప్ప ఎస్ ఈసీ ని దూషించడానికి కాదన్నారు. అయితే మంత్రి ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఎస్ ఈసీ ఆయనపై ఆంక్షలు విధించింది. ఈ నెల 21 వరకూ ఎలాంటి మీడియా సమావేశాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్ఈసీ ఆదేశాలపై ఏపీ హైకోర్టుకు వెళ్లనున్నారు మంత్రి కొడాలి నాని. ఎస్ ఈ సీ ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. మరోవైపు కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని మంత్రి కొడాలి నాని నిర్ణయం తీసుకున్నారు