శ్రీవారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. ఇందులో భాగంగా డిసెంబరు 25న తెల్లవారుజామున 12.05 నుండి 1.30 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 1.30 నుండి 2.30 గంటల వరకు ఏకాంతంగా అభిషేకం చేపడతారు. నిజపాద దర్శనం ఉండదు. ఆ తరువాత ఏకాంతంగా తోమాల సేవ, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 4.30 గంటల నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఉదయం 9 గంటలకు స్వర్ణరథం..
ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుండి 10 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు.
డిసెంబరు 26న చక్రస్నానం.
డిసెంబరు 26వ తేదీన వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గల స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవలు రద్దు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో డిసెంబరు 24 నుండి డిసెంబరు 26వ తేదీ వరకు కల్యాణోత్సవం,
ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
