చంద్రబాబు.. వైయస్ దోస్తానాపై వెబ్ మూవీ

0

రాజకీయ దిగ్గజాలు.. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్నేహంపై సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే సమాచారం. `చదరంగం` వెబ్ సిరీస్ తో పాపులరైన రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా యన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. తిరుమల రెడ్డి సహకారం అందించనున్నారు.

ఇది సెమీ బయోపిక్ తరహా. ఇక ఇందులో కీలకంగా వైయస్సార్ చంద్రబాబు స్నేహంపైనే ఫోకస్ చేయనున్నారట. రాజకీయాల్లో అడుగు పెట్టి అక్కడ ఎదిగే క్రమంలో ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఎలా ఉండేది? కాలక్రమంలో విరుద్ధమైన పార్టీలతో రాజకీయ శత్రువులుగా ఎలా మారారు? అన్నది తెరపై చూపించనున్నారు. అయితే ఇందులోనూ ఆరంభ స్నేహాన్ని హైలైట్ గా చూపిస్తారట. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

ఆ ఇద్దరూ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యుత్తమ పాలకులుగా వెలిగారు. ముఖ్యమంత్రులుగా ప్రజల్ని పాలించారు. ఇక ఈ మూవీ మొదటి భాగంలో అసలు చంద్రబాబు వైయస్సార్ మధ్య పరిచయం ఎలా జరిగింది.. ఆ పరిచయం ఎలా స్నేహంగా మారింది? అన్నది ప్రస్థావిస్తారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎదుగుదల సహా ఆయన సీఎం అయ్యేవరకూ కథతో ఈ మూవీని చూపిస్తారు. రెండో భాగంలో కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ రాజకీయంగా ఎలా ఎదిగారు? ముఖ్యమంత్రిగా ఎదిగే క్రమంలో తేదేపా అధినాయకుడు చంద్రబాబుతో వైరం ఎలా సాగింది? అన్నది చూపిస్తారట.