Templates by BIGtheme NET
Home >> Telugu News >> గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ?

గ్రేటర్ లో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ?


ఇపుడిదే పెద్ద పజిల్లాగ తయారైంది జనాలకు. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది ? ఏమీ కాదు ప్రతిరోజు గ్రేటర్ పరిధిలో గొడవల్లవటం తప్ప. ప్రభుత్వం ఎడ్డెమంటే బీజేపీ తెడ్డెమంటుందంతే. ఎందుకంటే రెండు పార్టీల మధ్య పరిస్ధితి ఉప్పు నిప్పులాగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అర్జంటుగా కేసీయార్ ను అధికారంలో నుండి దింపేసి అసెంబ్లీ ఎన్నికలు పెట్టించేసి తాను అధికారంలోకి వచ్చేద్దామని కమలంపార్టీ అనుకుంటోంది. అది జరుగుతుందా లేదా అన్నది భగవంతుడికే తెలియాలి. కానీ జరిగిపోతుందన్నట్లుగా రెచ్చోపోతోంది.

మొన్నటి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుండి బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎంతగా రెచ్చిపోతున్నారనే విషయాన్ని అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు చూస్తే అర్ధమైపోతోంది. సరే గెలుపోటములను పక్కన పెట్టేస్తే ఒకవేళ కమలం పార్టీ గెలిస్తే మాత్రం ప్రతిరోజు గొడవలే గొడవలు. ఎందుకంటే గ్రేటర్ లో గెలిచినంత మాత్రాన రాష్ట్రప్రభుత్వంపై పట్టుసాధించేది లేదు. గ్రేటర్ ఎన్నికలంటే మినీ తెలంగాణా ఎన్నికలనే అనుకోవాలి. అందుకనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించేసినట్లే బీజేపీ నేతలు ఫీలైపోతారు. దాంతో ప్రతిరోజు వివాదాలు జరుగుతునే ఉంటాయి.

2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి నాలుగంటే నాలుగే డివిజన్లున్నాయి. ఇపుడు మరో 20 దాకా అదనంగా గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. ఇపుడు గ్రేటర్ పీఠాన్ని గెలిచేసినంత హడావుడి చేయటంలో ఉద్దేశ్యం కూడా ఇదే. కేసీయార్ మీద నూరుశాతం మైండ్ గేమ్ ఆడుతున్న విషయం తెలిసిపోతోంది. కేసీయార్ టీఆర్ఎస్ నేతలు కూడా కమలంపార్టీ ఉచ్చులో పడిపోయినట్లే అనుమానంగా ఉంది.

బీజేపీ ఎన్ని డివిజన్లు గెలిచినా కేసీయార్ పై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనంగానే భావించాలి. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి వెళుతున్న మంత్రులు ఎంపిలు ఎంఎల్ఏలతో పాటు అభ్యర్ధులను కూడా ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు జనాలు. జనాల వైఖరి టీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదు. దాంతో బీజేపీ నేతలు కూడా బాగా రెచ్చిపోతున్నారు. ఎంత గ్రేటర్ ఎన్నికలైనా ఇది కూడా ప్రభుత్వంలో ఓ భాగమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రేటర్ లో బీజేపీ చేయగలిగేది ఏమీ ఉండదు. కాకపోతే కేసీయార్ పై వ్యతిరేకత బయటపడుతుందంతే.