గాల్లోని కరోనాను మింగేస్తుందట.. త్వరలో మార్కెట్లోకి?

0

ఇప్పుడంతా కరోనానే. ఎక్కడ చూసినా..ఎవరినోట విన్నా కరోనాకు సంబంధించిన అంశాలే చర్చకు వస్తున్నాయి. పెద్దగా ప్రభావం ఉండదని భావించిన సెకండ్ వేవ్ సీరియస్ గా మారటమే కాదు..రోజు వ్యవధిలో ఏకంగా 1.69 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావటం.. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో భారత్ నిలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో.. భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. కేరళ శాస్త్రవేత్తలు ఒక ఎలక్ట్రానిక్ సాధనాన్ని డెవలప్ చేశారు.

వుల్ఫ్ ఎయిర్ మాస్కు పేరుతో ఒక సాధనాన్ని తయారు చేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ మెషీన్ ను.. ఆన్ చేస్తే పదిహేను నిమిషాల వ్యవధిలో గాల్లోని కరోనా వైరస్ ను 99 శాతం మేర తగ్గిస్తారని చెబుతున్నారు. కేంద్ర బయో టెక్నాలజీ శాఖ అధ్వర్యంలో రాజకీయ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది.

ఈ పరికరం స్విచ్చాన్ చేయగానే ఇది తన పని మొదలు పెడుతుందని చెబుతున్నారు. నెగిటివ్ అయాన్ టెక్నాలజీ ద్వారా ఇది పని చేస్తుందని చెబుతున్నారు. ఒక పరికరం.. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలోగాలిని శుద్ధి చేసే వీలుందని చెబుతున్నారు.

ఇళ్లు.. ఆఫీసులు.. ఆసుపత్రులు.. హోటళ్లు తదితర ప్రాంతాల్లో వీటిని ఉంచటం ద్వారా గాల్లోని కరోనా వైరస్ ను నిర్వీర్యం చేసే వీలుందని చెబుతున్నారు. ఈ పరికరానికి ఎలాంటి సర్వీసింగ్ అవసరం లేదంటున్నారు. వైరస్ ను మాత్రమే కాదు.. బ్యాక్టీరియా.. శిలీంద్రాల్ని కూడా ఇది నిర్వీర్యం చేస్తుందని చెబుతున్నారు. అయితే.. దీని రేటు ఎంత ఉంటుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలో దీన్ని మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. నిజంగానే ఈ పరికరం ఇలా పని చేస్తే.. వ్యాక్సిన్ కంటే ముందు ఈ మెషిన్ కొనటం అవసరమేమో కదూ?