డాక్టర్ నే మోసం చేసిన మాయలేడి.. ఏం చేసిందంటే?

0

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేవారు సమాజంలో బోలెడు మంది ఉన్నారు. ఇందులో చదువుకున్న వారు కూడా ఇంకా మూఢ నమ్మకాలను విశ్వసిస్తారు. లంకి బిందలంటూ.. గుప్త నిధులంటూ ఇప్పటికే తవ్వుతూనే ఉంటారు. అయితే మనుషుల్లోని ఈ ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో పెద్ద చదువులు చదివిన ఓ డాక్టర్ ను కూడా ఓ మాయలేడి మోసం చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో లాయిక్ ఖాన్ అనే డాక్టర్ బ్రహ్మపురి ప్రాంతంలో వైద్యచికిత్సలు అందిస్తుంటాడు. కొద్దిరోజుల క్రితమే ఆయన లండన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. అలాంటి తెలివైన డాక్టర్ నే ఒక మాయలేడి బుట్టలో వేసింది. తన దగ్గర అల్లావుద్దీన్ దీపం ఉందని.. దాన్ని ఒక్కసారి రుద్దితే చాలు భూతం వచ్చి చెప్పిన పనల్లా బుద్దిగా చేసి వెళుతుందని చెప్పింది.

ఈ అరేబియన్ కథకు డాక్టర్ లాయిక్ ఖాన్ పడిపోయారు. అది తాతల కాలం నాటి కథ అని తెలిసి ఆ దీపంలో ఏదో మంత్రతంత్రాలు ఉన్నాయని డాక్టర్ గుడ్డిగా నమ్మాడు.

ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ దీపాన్ని రెండున్నర కోట్లకు కొనేసుకున్నాడు. తర్వాత దీపం రుద్దగా ఏ భూతం రాలేదు.. వరాలు ఇవ్వలేదు. దీంతో మోసపోయానని తెలిసి లబోదిబోమన్నాడు.

ఆయనను మోసం చేసింది సమీనా అనే మాయలేడి. డాక్టర్ వద్దకు అనారోగ్య సమస్యలు వంటూ వచ్చి తానో మాంత్రికుడిని కలిశానని.. అతడి దగ్గర మహా అద్భుతమైన దీపం ఉందని.. నమ్మించి ఇలా మోసం చేసింది. కొద్దిరోజులు ఆ దీపాన్ని తాకవద్దని.. ఆ తర్వాత కొన్ని రోజులకు రుద్దాలని అప్పుడు భూతం వచ్చి వరాలు ఇస్తుందని చెప్పింది. దీనికి నమ్మి 2.50 కోట్లకు కొని మోసపోయాడు.

డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వేగంగా స్పందించి ఇస్లాముద్దీన్ అనే ఆ మాంత్రికుడిని పట్టుకున్నారు. మాయలేడి మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు.