శాసనంలో చరిత్ర.. దేవుడికి కట్నాలు

0

భారతదేశం విభిన్న ఆచారాలు సంప్రదాయాల కలబోతగా ఉంది. ప్రాచీన కాలం నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పటికీ శాసనాలు శిలా ఫలకాలు తవ్వకాల్లో బయటపడుతూ మన చరిత్రను కళ్లకు కడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఒక రాతి శాసనం వెలుగుచూసింది.

దీన్ని దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనంగా పేర్కొంటారు. పురాతన కాలం నాటి అనేక ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఈ శాసనం. ఈ శాసనం ద్వారా గతంలో దేవుడి ఉత్సవాలకు కల్యాణానికి కట్నాలు చెల్లించేవారని తెలిసిందని తెలంగాణ జాగృతి చరిత్ర బృందం ప్రతినిధి పురాతత్వ పరిశోధకుడు రామోజు హరగోపాల్ తెలిపారు.

గతంలో ఓ ఊరిలో ఉన్న సీతారామచంద్రస్వామి విగ్రహాలను మన్నెగూడెం తీసుకొచ్చారట.. కొన్నాళ్లు దీపధూప నైవేద్యాలు చేశాక ఇవి ఆగిపోవడంతో కొందరు గుడి నిర్మాణానికి భూదానం చేసి విగ్రహాలను సంకీసకు తీసుకొచ్చి ప్రతిష్టించారని శాసనంలో ఉంది. భూదాన పత్రం శిథిలం కావడంతో రాగి రేకుపై ఈ విషయాలను రాయించారని హరగోపాల్ పేర్కొన్నారు.

సీతారామ చంద్రస్వామి కల్యాణంలో 30 గ్రామాల ప్రజలు పాల్గొనేవారని.. తమ ఇళ్లలో వివాహాలు జరిగితే ఆడపెళ్లి వారు అర్ధరూపాయి మగపెళ్లివారు రూపాయి వంతున దేవుడికి కట్నమిచ్చేవారని శాసనాలను బట్టి తెలుస్తోందని వివరించారు.