సూపర్ స్టార్స్ మద్య 30 నిమిషాల ఫోన్ సంభాషణ

0

తమిళనాట స్టార్ హీరోల ఫ్యాన్స్ మద్య వైరం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొట్టుకు చచ్చేంతగా గొడవలు పడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఒకరి హీరోపై మరొకరు విమర్శలు కురిపించడం సర్వ సాదారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు అజిత్ ఫ్యాన్స్ మద్య జరిగే సోషల్ వార్ ఎన్నో సార్లు శృతి మించింది. అభిమానులు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉన్నా హీరోలు ఇద్దరు మాత్రం స్నేహంగా ఉంటారు. రజినీకాంత్ అంటే అజిత్ కు చాలా అభిమానం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ రంగ ప్రవేశం చేసి 45 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా కోలీవుడ్ లోని ప్రముఖులు అంతా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులు రజినీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలోనే సూపర్ స్టార్ కు అజిత్ నుండి కూడా కాల్ వచ్చిందట. అజిత్ స్వయంగా రజినీకాంత్ కు కాల్ చేసి ఏకంగా అర్థగంట పాటు మాట్లాడారట. సినిమా ఇండ్రస్టీకి సంబంధించిన విషయాలతో పాటు పలు విషయాల గురించి కూడా ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మద్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

వీరిద్దరి కలయికతో ఫ్యాన్స్ లో కొత్త ఆలోచనలు చిగురెత్తుతున్నాయి. రజినీకాంత్ పార్టీ పెట్టేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో వీరిద్దరు కలవడంతో రాజకీయాల్లో కూడా కలిసి నడిస్తే వీరిద్దరికి తిరుగు ఉండదని అంటున్నారు. కాని అది అయ్యేనా అనేది అనుమానమే. రాజకీయంగా కలువకున్నా వీరిద్దరి మద్య చర్చలు జరగడం నిజంగా ఆనందదాయకం అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.