50 ఇయర్స్ సెలబ్రేషన్ : వెయ్యి కోట్లతో 5 సినిమాలు

0

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ వచ్చే నెలతో 50వ వడిలోకి అడుగు పెట్టబోతుంది. ఈ 50 ఏళ్లలో ఎన్నో అద్బుతమైన రికార్డు బ్రేకింగ్ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ముందు ముందు మరిన్ని మంచి సినిమాలను ఇండియన్ సినీ ప్రేమికులకు అందించాలని భావిస్తుంది. అందులో భాగంగా 50 ఏళ్లలో అడుగు పెట్టిన సందర్బంగా వెయ్యి కోట్లతో సినిమాలను నిర్మించబోతున్నట్లుగా సెప్టెంబర్ 27వ తారీకున యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆధిత్య చోప్రా ప్రకటించబోతున్నాడట.

అయిదు సినిమాలను వేరు వేరు బడ్జెట్ వేరియేషన్స్ తో వెయ్యి కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసి నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి చివరి దశ చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్.. అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో ఈ సినిమాలు రూపొందబోతున్నాయి. వీరితో పాటు విక్కీ కౌశల్ వంటి కొత్త హీరోతో కూడా ఒక సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించబోతుంది. ఈ సినిమాల బడ్జెట్ విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ ల సినిమాల బడ్జెట్ రూ. 500 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు.

అజయ్ దేవగన్ తో తీయబోతున్న సూపర్ హీరో మూవీని దాదాపుగా రూ.200 కోట్లతో నిర్మించబోతున్నారు. ఇక హృతిక్ రోషన్ హీరోగా చేయబోతున్న సినిమాకు గాను 225 కోట్ల బడ్జెట్ ను విక్కీ కౌశల్ తో చేయబోతున్న సినిమాకు 75 కోట్లను ప్లాన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ ల విషయంలో కాస్త అటు ఇటుగా మారినా మొత్తం బడ్జెట్ విషయంలో మాత్రం ఆధిత్య చోప్రా తగ్గేది లేదంటున్నాడు. వెయ్యి కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ అయిదు సినిమాలను నిర్మించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఒకేసారి ఈ సినిమాలన్నీ కూడా మొదలయ్యి 2021 మరియు 22 ల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.