అమితాబ్ కొడుకు హుందాతనానికి హ్యాట్సాఫ్

0

సూపర్ స్టార్ల వారసత్వంతో హీరోలయ్యే వాళ్లందరూ కూడా సూపర్ స్టార్లు అయిపోతారని అనుకోలేం. ఇందుకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చనే నిదర్శనం. రెండు దశాబ్దాల కిందట ఎన్నో అంచనాలతో ‘రెఫ్యూజీ’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన అతను.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. పడుతూనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ తనకంటూ ఓ స్థాయి అందుకోలేకపోయాడు. ‘ధూమ్’ సిరీస్ సహా అభిషేక్ కెరీర్లో హిట్లు ఉన్నప్పటికీ.. వాటి క్రెడిట్ అతడికి పెద్దగా దక్కింది లేదు. ఏ సినిమా కూడా అభిషేక్ కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు. అతణ్ని నమ్మి భారీ బడ్జెట్ పెట్టి తీసిన ‘ద్రోణ’ లాంటి సినిమాలు దారుణమైన పరాజయాన్ని అందుకోవడంతో అభిషేక్ హీరోగా ఎదగలేకపోయాడు. ‘గురు’ లాంటి సినిమాలు అభిషేక్ నట సామర్థ్యాన్ని చాటినప్పటికీ.. అతను బ్యాంకబుల్ స్టార్ మాత్రం కాలేకపోయాడు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తరచుగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటాడు అభిషేక్. అతడి ఫ్లాప్ సినిమాల్ని గుర్తు చేసి తిడుతుంటారు. అతడి నటనను విమర్శిస్తుంటారు. మరీ చీప్ కామెంట్లు పెడుతుంటారు నెటిజన్లు. ఐతే ఇలాంటి ట్రోల్స్కు అభిషేక్ స్పందించే తీరు ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. అందరిలా అతను ఫాల్స్ ఇమేజ్తో కనిపించడు. తనను ట్రోల్ చేసే వారి మీద ఎదురు దాడి చేయడు. వాళ్లను రివర్స్లో తిట్టడు. తన వైఫల్యాన్ని నిజాయితీగా అంగీకరిస్తాడు. ఎప్పుడూ కూడా అతను ఈ విషయంలో సంయమనం కోల్పోయింది లేదు.

తాజాగా థియేటర్లు రీఓపెన్ కానున్న విషయంపై ఆనందం వ్యక్తం చేస్తూ అభిషేక్ ట్వీట్ వేస్తే ఒక నెటిజన్ బదులుగా.. నీకు ఇంకా అవకాశాలు ఆగిపోలేదా అంటూ అతణ్ని కవ్వించే ప్రయత్నం చేశాడు. దానికతను బదులిస్తూ ‘‘అది మీ చేతుల్లోనే ఉంది. మీకు మా పని నచ్చకపోతే మాకు పని ఉండదు. కాబట్టి మా శక్తి మేరకు అత్యుత్తమంగా పని చేస్తాం. మంచి ఫలితం కోసం ఎదురు చూస్తాం’’ అన్నాడు. దీనిపై మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ద్రోణ తర్వాత కూడా నీకు సినిమా అవకాశాలు ఎలా వస్తున్నాయి’’ అని ఎగతాళిగా అడిగాడు. దానికి అభిషేక్ హుందాగానే స్పందించాడు. ‘‘నాకు నిజంగానే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని సినిమాల నుంచి నన్ను తప్పించారు కూడా. అయినా సరే ఆశతో జీవిస్తూ ప్రయత్నం కొనసాగిస్తూ మన లక్ష్యాల కోసం ప్రయత్నించాల్సిందే’’ అంటూ వినమ్రంగా చెప్పి ఆ నెటిజన్ నోట మాట రాకుండా చేశాడు.