వెబ్ సిరీస్ కి తన కుమార్తె పేరు ఎందుకు పెట్టారో చెప్పిన రేణు దేశాయ్

0

‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణూ దేశాయ్.. ‘జానీ’ సినిమా తర్వాత నటనకు దూరం అయింది. కాకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగింది. అలానే ఎడిటర్ గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో విడిపోయాక ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్లు రేణు దేశాయ్ ఇటీవల ప్రకటించారు. ”ఆద్య” అనే పవర్ ఫుల్ లేడి ఓరియెంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు రేణు. దసరా సందర్భంగా ‘ఆద్య’ వెబ్ సిరీస్ ని హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకత్వం వహించనున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ని డి.ఎస్.కె.స్క్రీన్ – సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై డి.ఎస్.రావు – రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కాగా ఈ వెబ్ సిరీస్ కి పెట్టిన టైటిల్ ‘ఆద్య’ రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ ల ఏకైక కుమార్తె పేరు కూడా అనే విషయం తెలిసిందే. ఈ సిరీస్ కి ‘ఆద్య’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనే విషయాన్ని రేణు దేశాయ్ వెల్లడించారు. ‘ఈ సిరీస్ కు తన కుమార్తె ఆద్య పేరు పెట్టాలని ముందుగా ప్లాన్ చేసుకోలేదు.. ఇది పూర్తిగా యాదృచ్చికంగా జరిగింది.. వాస్తవానికి సిరీస్ కి ‘ఆద్య’ అనే టైటిల్ నిర్మాత డిఎస్ రావు సూచించారు’ అని రేణు పేర్కొంది. అలానే తన కుమార్తెకు ఆద్య అనే పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని వెల్లడిస్తూ ‘ఆద్య’ అంటే ‘మహా సరస్వతి’ ‘మహా లక్ష్మి’ మరియు ఆదిశక్తికి ప్రతీక అయిన మహా కాళి అని అర్ధం. మీరు ఈ సిరీస్ ను చూసిన తర్వాత ‘ఆద్య’ అని ఎందుకు పేరు పెట్టారో మీకు అర్థం అవుతుందని రేణు తెలిపారు.