Templates by BIGtheme NET
Home >> Cinema News >> పిండం.. 15 ఏళ్ళ తరువాత వచ్చిన విజయం

పిండం.. 15 ఏళ్ళ తరువాత వచ్చిన విజయం


హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన హారర్ చిత్రం పిండం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకూ షోలు పెంచుకుంటూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం.. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం విజయోత్సవ సభను నిర్వహించింది.

కార్యక్రమంలో భాగంగా హీరో శ్రీరామ్ మాట్లాడారు. “మా పిండం మూవీని ప్రేక్షకులకు చేరువ చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిజాయతీగా సినిమా చేస్తే గెలిపిస్తామన్న నమ్మకాన్ని మరోసారి ఇచ్చారు. 15 ఏళ్ల తర్వాత నాకు సోలో విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా దర్శకుడు సాయికిరణ్ గారికి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను రూపొందించారు. మన చేసే పని పట్ల నిజాయితీ, నిబద్దత ఉంటే అలా చేయగలరు” అని హీరో శ్రీరామ్ తెలిపారు.

సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారని పిండం మూవీ మరోసారి రుజువు చేసిందని నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి తెలిపారు. కళాహి మీడియా బ్యానర్‌ లో రెండో సినిమాను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో పొలిటికల్ కాన్సెప్ట్ తో మూవీ తీయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది షూటింగ్ మొదలవునున్నట్లు వెల్లడించారు. 36 రోజుల్లోనే పిండం మూవీని దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించినట్లు చెప్పారు. 170 స్క్రీన్ లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు 400కుపైగా స్క్రీన్ లలో ప్రదర్శితమవుతున్నట్లు తెలిపారు.

పిండం మూవీతోనే టాలీవుడ్ కు పరిచయమయ్యారు దర్శకుడు సాయి కిరణ్ దైదా. “నేను పిండం కథ మొదలు పెట్టినప్పుడు.. ఈ సినిమా థియేటర్లలో ఇంత భారీగా విడుదలవుతుందని ఊహించలేదు. యూఎస్ లో 120కుపైగా స్క్రీన్ లు, ఇండియాలో 400 కు పైగా స్క్రీన్ లలో ఈ సినిమా విడుదల కావడం నిజంగా గొప్ప విషయం.

దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ వేడుకను ఉద్దేశించి మట్లాడారు. “మంచి సినిమాకు ఎప్పుడూ ప్రేక్షకుల మనసులో చోటు ఉంటుంది. పిండం సినిమాతో అది మరోసారి రుజువైంది. మేము చేసిన ఈ మంచి సినిమా, ప్రేక్షకుల మన్ననలు పొందటం సంతోషంగా ఉంది. మున్ముందు ఇలాంటి మంచి సినిమాలు అందించడానికి కృషి చేస్తాం” అని రచయిత కవి సిద్ధార్థ తెలిపారు.

ఈ విజయోత్సవ వేడుకలో సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్, ఎడిటర్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ పద్మ ప్రియ తదితరులు పాల్గొన్నారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది.