‘ఆహా’ సూపర్ సెప్టెంబర్ లో ‘జ్యోతిక డబుల్ ధమకా’…!

0

తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ యాప్ లో గత నెలలో ‘ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్’తో వచ్చినట్లే ఈ నెలలో ‘సూపర్ సెప్టెంబర్’ అంటూ మరికొన్ని సినిమాలను స్ట్రీమింగ్ పెడుతోంది. సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన రెండు తమిళ్ సినిమాల తెలుగు డబ్బింగ్ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘జ్యోతిక డబుల్ ధమకా’ పేరుతో వారాంతంలో ఆమె నటించిన ‘మగువలు మాత్రమే’ మరియు ‘బంగారు తల్లి’ డిజిటల్ ప్రీమియర్స్ విడుదల కానున్నాయి. ఇంతకముందు జ్యోతిక నటించిన ’36 వయాధినైల్’ అనే తమిళ్ సినిమా తెలుగు డబ్బింగ్ ’36 వయసులో’ పేరుతో ఆహాలో విడుదలై విశేష ఆదరణ తెచ్చుకుంది. ఈ క్రమంలో తమిళ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న జ్యోతిక సినిమాలు ‘పొన్మగల్ వంధల్’ చిత్రాన్ని ‘బంగారు తల్లి’ పేరుతో.. ‘మగలిర్ మాట్టం’ అనే సినిమాని ‘మగువలు మాత్రమే’ అనే పేరుతో రేపు(సెప్టెంబర్ 11న) స్ట్రీమింగ్ కి పెడుతున్నారు.

కాగా ‘బంగారు తల్లి’ సినిమా 2004వ సంవత్సరంలో ఊటీలో జరిగిన కిడ్నాప్ నేపథ్యంలో రూపొందింది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జ్యోతిక భర్త హీరో సూర్య నిర్మించారు. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక ‘వెన్నెల’ అనే క్యారక్టర్ ప్లే చేసింది. జ్యోతికతో పాటు భాగ్యరాజ్ – పార్థీబన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ‘మగువలు మాత్రమే’ సినిమాలో ప్రభ అనే పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం స్నేహం మరియు సోదరభావం విశిష్టతను తెలియజేస్తుంది. జ్యోతిక విభిన్న పాత్రల్లో నటించిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించనున్నాయి. ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు సినిమా ట్రైలర్స్ హీరో సూర్య ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిక తన చిత్రాల ప్రీమియర్ల గురించి మరియు ’36 వయసులో’ మంచి ఆదరణ తెచ్చుకోవడంపై మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులు ఇన్ని సంవత్సరాల తరువాత నాపై ఇంత ప్రేమను కనబరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు స్పెషల్ సినిమాలు కూడా మిమ్మల్ని అలరిస్తే నేను సంతోషిస్తున్నాను” అని పేర్కొన్నారు.