ట్రైలర్ టాక్ : ఫన్నీ అమ్మోరు తల్లి

0

నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం మూకుత్తి అమ్మన్ తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ అవుతోంది. వచ్చే నెల 14వ తారీకున ఓటీటీ ద్వారా దీపావళి కానుకగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమ్మోరు సినిమా అంటే సీరియస్ నోడ్ తో సాగుతుందని భావించిన ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యేలా ఈ సినిమా చాలా ఫన్నీగా సాగింది. మతం.. భక్తి పేరుతో కొందరు వ్యాపారం చేస్తున్నారనే ఆవేదనతో ముక్కు పుడక అమ్మ వారు అయిన నయనతార ఒక ఫ్యామిలీకి సాక్ష్యాత్కరించి వారి కోరికలు తీర్చుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.

అమ్మ వారు అంటే భక్తి శ్రద్దలతో పూజలు చేసే ఫ్యామిలీ నిజంగా అమ్మవారు ప్రత్యక్షం అయితే నిజమైన అమ్మ వారు కాదు అంటూ పరీక్షలు పెట్టడం నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. ట్రైలర్ లోనే సినిమా కథ ఏంటీ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంది.

దేవుడిని నమ్మని వాడితో ఎలాంటి ఇబ్బంది లేదు. కాని ఒక్క దేవుడే ఉన్నాడు మరో దేవుడు నిజం కాదు అంటూ ఇతరుల మనో భావాలను దెబ్బ తీసే వాడు సమాజానికి మంచిది కాదంటూ ఒక చక్కని మెసేజ్ ను కూడా ఈ ట్రైలర్ తో ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా నయనతార ఖాతాలో మరో హిట్ గా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈనెల 14వ తారీకున డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ఆర్ జే బాలాజీ.. ఊర్వశీ.. మౌళి.. అజయ్ ఘోష్ లు కనిపించబోతున్నారు.