‘అంటే.. సుందరానికీ!’ స్టోరీ అదేనా..?

0

నేచురల్ స్టార్ నాని ‘అంటే… సుందరానికీ!’ అనే టైటిల్ తోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తిని కలిగించాడు. ‘బ్రోచేవారేవరురా’ ‘మెంటల్ మదిలో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని – యలమంచిలి రవిశంకర్ నిర్మించనున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ వెల్లడిస్తూ విడుదల చేసిన ఆసక్తికరమైన వీడియోతో ఇదొక సంగీతభరిత వినోదాత్మక ప్రేమకథ అని తెలుస్తోంది. ఇందులో నాని పంచకట్టులో లగేజ్ బ్యాగ్ పట్టుకొని బ్యాక్ సైడ్ లుక్ చూపించారు. టైటిల్ చుట్టూ వీణ – కెమెరా – సైకిల్ – బూట్లు – తోలుబొమ్మలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఈ సినిమా స్టోరీ ఇలా ఉండబోతోందని సోషల్ మీడియాలో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

‘అంటే… సుందరానికీ!’ మూవీలో నాని ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో కనిపిస్తారని.. హిందూ ఫ్యామిలీలో పుట్టిన అతను… క్రిస్టియన్ మతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను ఇందులో హాస్యభరితంగా చెప్పబోతున్నారని అంటున్నారు. క్రిస్టియన్ అమ్మాయి ని హిందూ అమ్మాయిగా తన ఫ్యామిలీకి పరిచయం చేసిన హీరో.. ఆ తర్వాత పడే ఇబ్బందులు ఫన్నీ గా ఉండబోతున్నాయట. ఇదే కనుక నిజమైతే ఈ స్టోరీ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు – కృష్ణ నుంచి అల్లరి నరేష్ వరకు ఇలాంటి సినిమాల్లో నటించారు. కాకపోతే ఇక్కడ నాని నేచురల్ పెరఫార్మన్స్ తోడవనుంది. ఈ వార్తల్లో నిజమెంతో తీయాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్ గా వర్క్ చేస్తుండగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.