‘నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే వాటికి దూరంగా ఉన్నా’

0

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా ‘స్వీటీ’ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే భారీగా ఫాలోయింగ్ ఉన్న అనుష్క సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు.

ప్రస్తుతం సినీ ప్రముఖులందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నేరుగా అభిమానులతో టచ్ లో ఉంటుంటే.. అనుష్క మాత్రం కాస్త దూరంగా ఉంటుంది. ఫేస్ బుక్ లో 14.4 మిలియన్.. ఇన్స్టాగ్రామ్ లో 3.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ అనుష్క అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్ ఇస్తుంటుంది. ఇక ట్విటర్ లో అయితే ఇప్పటివరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో మరి ట్విటర్ లోకి ఎప్పుడు వస్తారని స్వీటీని ప్రశ్నిస్తే.. నాకు సిగ్గు ఎక్కువ అందుకే దూరంగా ఉన్నానని సమాధానం చెప్పింది.

”నాకు కొంచెం సిగ్గెక్కువ. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను. సినిమాలు తప్ప వేరే విషయాల గురించి పట్టించుకోను. టైం కుదరకపోవడం వల్లే సోషల్ మీడియా మాధ్యమాలకు దూరంగా ఉంటున్నా. ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. అభిమానులు ట్విటర్ లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అటు వైపు రాకపోవడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. నిజం చెప్పాలంటే నాకు సోషల్ మీడియా మీద పెద్దగా అవగాహన లేదు. ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు ట్విటర్ లోకి కచ్చితంగా వస్తా. అప్పటి నుంచి అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటా” అని అనుష్క చెప్పుకొచ్చింది.