బాబాయ్ – అబ్బాయ్ కలుస్తోంది సినిమా కోసం కాదా..?

0

దగ్గుబాటి వెంకటేష్ – రానా కలిసి సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో వెంకీ స్టెప్పులేసి అలరించాడు. అప్పటి నుంచి బాబాయ్ – అబ్బాయ్ కాంబినేషన్ లో పూర్తి స్థాయి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబాయ్ తో కలసి ఓ సినిమా చేయబోతున్నట్లు.. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు రానా దగ్గుబాటి తెలిపాడు. సినీ వర్గాల సమాచారం మేరకు రానా – వెంకీ కలిసి నటించేది సినిమాలో కాదని తెలుస్తోంది.

వెంకటేష్ – రానా కలిసి సినిమా కంటే ముందుగానే ఓ వెబ్ సిరీస్ తో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారట. భారీ స్కేల్ లో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ కి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట. కాకపోతే డైరెక్టర్ మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం ఓ బాలీవుడ్ డైరెక్టర్ ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మరి చివరకు ఎవరిని ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనలైజ్ చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా దగ్గుబాటి రానా ఇటీవలే స్టార్ట్ చేసిన యూ ట్యూబ్ ఛానెల్ కోసం వెంకీ – రానా కలిసి అలరించనున్నారనే మరో న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.