‘ఆర్.ఆర్.ఆర్’ వివాదం: బెదిరింపులకు పాల్పడటం ఎంత వరకు కరెక్ట్..?

0

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గా.. ‘అల్లూరి సీతారామరాజు’గా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ లుక్ ని రివీల్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే ఇందులో తారక్ ని ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించినట్లు చూపించడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ ‘ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీమ్ చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని.. నిజాం వ్యకులతో పోరాటం చేసిన భీమ్ కు ఇతర మతాలతో సంబంధం పెట్టి టోపీలు పెట్టడం సరైంది కాదని.. కలెక్షన్ల కోసం పాత్రను వక్రీకరిస్తే బాగోదని.. టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. ఇలాగే మొండిగా సినిమా విడుదల చేస్తే థియేటర్లపై దాడులు జరిగే అవకాశం ఉదని’ రాజమౌళి కి వార్నింగ్ ఇచ్చాడు.

ఇదే క్రమంలో తెలంగాణా బీజేపే అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా రాజమౌళి పై సంచలన కామెంట్స్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ”కొమురం భీమ్ ను కించపరిచేలా సినిమా తీసిన రాజమౌళికి గుణపాఠం తప్పదు. మా బిడ్డను కించపరిచేలా ముస్లిం టోపీ పెట్టినవు. దమ్ముంటే ఓల్డ్ సిటీ లో వున్న ముస్లింలకి కాషాయం కండువా వేసి సినిమా తీయ్. బిడ్డా రాజమౌళీ.. ఈ సినిమా రిలీజ్ చేస్తే బరిగలతో కొట్టి చంపుతాం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా రిలీజ్ చేస్తే థియేటర్స్ తగల బెడతామని.. ధ్వంసం చేస్తామని.. కొమురం భీంకి టోపీ ఉంటే సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో చూస్తాం అని బీజేపీ ఎంపీ హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ జనాలు సినీ అభిమానులు బీజేపీ ఎంపీల వార్నింగ్ లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదని రాజమౌళి అభిమానులు మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముక్త ఖంటంతో ఖండిస్తున్నారని తెలుస్తోంది. ఇలా మీడియా ముఖంగా బెదిరింపులకు పాల్పడకుండా రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. లేదా దర్శకుడు రాజమౌళితో మాట్లాడి ‘ఆర్.ఆర్.ఆర్’లోని వివాదాస్పద సన్నివేశాలను తొలగించే విధంగా ఒప్పించడానికి ఎందుకు ప్రయత్నించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వివాదంపై రాజమౌళి లేదా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్ర బృందం ఇంతవరకు స్పందించలేదు