‘వి’ మూవీని ఓటీటీలో చూడమని ప్రకటించిన నాని…!

0

నాని – సుధీర్ బాబు హీరోలుగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. నాని కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న ‘వి’ లో అదితి రావ్ హైదరి – నివేత థామస్ లు హీరోయిన్స్ గా నటించారు. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న ‘వి’ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనుకున్నారు. మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందని నాని పరోక్షంగా ట్వీట్ చేశాడు.

కాగా నాని ‘వి’ ఓటీటీ రిలీజ్ కి సంబంధించి రేపు కీలక ప్రకటన చేయబోతోందని ప్రకటించాడు. దీనికి నాని హోమ్ థియేటర్ లో సినిమా చూస్తున్నట్లు ప్రమోట్ చేస్తూ ఓ వీడియో కూడా జతచేసాడు. ”సినిమా అయిపోతేనేమి.. మళ్ళీ చూస్తా.. మళ్ళీ మళ్ళీ చూస్తా.. నాకు ఇష్టమొచ్చినన్ని సార్లు చూస్తా.. థియేటర్ ఇంటికి వచ్చినా రాకపోయినా థియేటర్ ఎక్స్ పీరియన్స్ మాత్రం ఇంటికి రాబోతోంది. మన ఇళ్లే థియేటర్ గా మారబోతోంది” అంటూ నాని చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్ని రోజులు ఈ సినిమాపై వస్తున్న వార్తలన్నీ నిజమే అని నాని కంఫర్మ్ చేసాడు. ఓటీటీలో విడుదల కానున్న తొలి తెలుగు భారీ చిత్రం ఇదేనని చెప్పవచ్చు. అయితే ఈ వీడియో రిలీజ్ చేయడం ద్వారా నాని థియేటర్స్ కన్నా ఓటీటీలు గొప్ప అనే విధంగా ప్రమోట్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాని సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సమాచారం.