పవర్ స్టార్ ని ఢీ కొట్టనున్న పవన్ డై హార్డ్ ఫ్యాన్…?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయ దశమి కానుకగా న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ‘కింగ్ ఆఫ్ యాటిట్యూడ్.. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్ తో రాబోతున్నారు’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇది మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కనుందని సమాచారం. మలయాళంలో బిజూ మీనన్ పోషించిన సిన్సియర్ పోలీసాఫీసర్ రోల్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. అలానే పృథ్వీరాజ్ పోషించిన రోల్ లో దగ్గుబాటి రానా నటించనున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాత్ర కోసం మరో హీరో పేరు తెరపైకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ నటించే ఈ సినిమాలో రానా నటించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఈ మల్టీస్టారర్ లో పవన్ డై హార్డ్ ఫ్యాన్ యువ హీరో నితిన్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ ఇప్పటికే వరుస సినిమాలు కమిట్ అవుతూ బిజీ హీరోగా మారిపోయాడు. అందులోనూ ఫేవరేట్ హీరో సినిమాలో అవకాశం వస్తే నటించడానికి ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సితార బ్యానర్ లో రూపొందే సినిమాలో తన అభిమాన హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాలో పవన్ తో నితిన్ ఢీ కొట్టడానికి రెడీ అయినట్లే. హీరోలు ఇద్దరి మధ్య ఉండే ఇగోల కారణంగా వాళ్ళ జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ఇద్దరి రోల్స్ పోటాపోటీగా ఉండనున్నాయి. మరి నితిన్ ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.