‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్

0

బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ ఇండియా ఊర్వశి రౌతేలా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్లాక్ రోజ్”. హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అందాల భామ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. షేక్స్ పియర్ రచన ‘ద మర్చంట్ ఆఫ్ వెనిస్’లో ‘షైలాక్’ అనే పాత్రని ఆధారంగా చేసుకుని ఈ ఫిమేల్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. ‘విచక్షణలేని యోగ్యత లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం’ అనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని కాన్సెప్ట్ ను జోడిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ క్రమంలో ‘అందరూ రోజ్ ని కొప్పులో పెట్టుకుంటారు.. కానీ మా లేడీ షైలాక్ హిప్ లో పెట్టుకుంది’ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ.. నేడు ‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా ‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా రెడ్ శారీలో మరింత హాట్ గా కనిపిస్తోంది. ఆమె నడుచుకుంటూ వస్తుండగా కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతున్నట్లు చూపించారు. ‘మీరు మీ డబ్బును ఎవరికైనా అప్పుగా ఇస్తే.. డబ్బును కోల్పోవడమో లేదా శత్రువును పొందడటమో జరుగుతుంది’ అని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ‘బ్లాక్ రోజ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన సంపత్ నంది.. ‘ఈ బిగ్ బ్యాడ్ వరల్డ్ లో రోజెస్ ఉన్నాయి.. ఆపై బ్లాక్ రోజ్ కూడా ఉంది’ అని పేర్కొన్నాడు. కాగా పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ జరుపుతున్నారు.