బాలీవుడ్ క్రేజీ బ్యూటీకి టాలీవుడ్ పై ఆసక్తి

0

సాదారణంగా అయితే సౌత్ హీరోయిన్స్ కు బాలీవుడ్ అంటే మోజు. అక్కడ కనీసం ఒక్క సినిమాలో నటించినా చాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది అంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ వైపు పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు. చాలా చాలా తక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ మన వద్ద నటించిన దాఖలాలు ఉన్నాయి. కాని ఈమద్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమాలు గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఒక మాట చెప్పాలంటే బాలీవుడ్ కంటే కొన్ని టాలీవుడ్ సినిమాలు అధిక బడ్జెట్ తో రూపొందుతూ అధిక వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు వరుగా సౌత్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈమద్య కాలంలో బాలీవుడ్ నుండి సౌత్ కు ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే ఐటెం సాంగ్ ద్వారా పరిచయం. ఈమె మరింతగా తెలుగు ఆడియన్స్ కు దగ్గర అయ్యేందుకు ఆసక్తిగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలుగు సినిమా పరిశ్రమలో నటించాలనే ఆసక్తి ఉందంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్నా కూడా అక్కడ నటించడం కోసం వెయిట్ చేస్తున్నాను అంటూ ఈమె చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక భారీ పాన్ ఇండియా మూవీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. క్రిష్ ఆమెను పవన్ కు జోడీగా ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సమయంలోనే కరోనా లాక్ డౌన్ వచ్చి సినిమా వాయిదా పడింది. మళ్లీ వచ్చే నెల నుండి సినిమా పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో జాక్వెలిన్ టాలీవుడ్ ఆఫర్ కోసం ఆసక్తిగా ఉన్నాను అంటూ వ్యాఖ్య చేయడంతో పవన్ మూవీలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.