చెల్లి పెళ్లి కోసం ‘బాక్సర్’ బ్రేక్

0

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘బాక్సర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ వరకు పూర్తి అయ్యి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయినట్లుగా నైట్ షెడ్యూల్ చేస్తున్నట్లుగా వరుణ్ తేజ్ పేర్కొన్నాడు. రెండు వారాల పాటు షూటింగ్ జరిగింది. మరో వారం పది రోజుల పాటు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అయితే చెల్లి నిహారిక పెళ్లి కారణంగా వరుణ్ తేజ్ షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడు.

నిహారిక.. చైతన్యల వివాహం వచ్చే నెలలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగబోతుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా వరుణ్ తేజ్ దగ్గరుండి ఒక అన్నగా బాధ్యత యుతంగా చూసుకోవాల్సి ఉన్న కారణంగా సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ వేశాడు. పెళ్లి పనులు పూర్తి అయిన తర్వాత మళ్లీ పునః ప్రారంభించనున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మళ్లీ వైజాగ్ లో నెల రోజుల చిత్రీకరణతో సినిమా పూర్తి అవుతుందని అంటున్నారు.

ఈ సినిమాను సిద్దు ముద్దతో కలిసి అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. బాబీ నిర్మాతగా ఇది మొదటి సినిమా ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ రియల్ బాక్సింగ్ ఛాంపియన్స్.. ఒలింపిక్ విజేతల వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. కండలు పెంచడంతో పాటు పూర్తి బాక్సర్ లుక్ కు మనోడు వచ్చాడు. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి.