తమ్ముడి తర్వాత అన్న రష్మిక రెడీ

0

తెలుగు మరియు కన్నడంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు తమిళంలో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అయ్యింది. కార్తీ హీరోగా రూపొందుతున్న సుల్తాన్ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల చేయబోతున్నారు. రష్మిక మొదటి సినిమా తమిళంలో ఇంకా విడుదల కాకుండానే అప్పుడే రెండవ సినిమాకు సబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

పలువురు ఫిల్మ్ మేకర్స్ ఈమెను సంప్రదిస్తున్నారు. అయితే తెలుగులో భారీ పారితోషికాలతో ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో తమిళ ఆఫర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. పెద్ద సినిమాలు స్టార్ హీరోలకు అయితేనే అక్కడ ఓకే చెప్పాలి అనేది ఈ అమ్మడి అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో పుష్ప వంటి భారీ సినిమాలో నటిస్తుంది. అందుకే తమిళంలో కూడా అలాంటి పెద్ద సినిమా స్టార్ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడికి సూర్య సినిమాలో ఛాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

తమిళ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సూర్య హీరోగా పాండిరాజన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో ఈ అమ్మడికి అవకాశం దక్కిందట. తమిళ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల నటించేందుకు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.