‘కలర్ ఫోటో’ టీమ్ కి బన్నీ ప్రశంసలు..!

0

హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయమైన సినిమా ”కలర్ ఫోటో”. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి చాందినీ చౌదరి నటించింది. సునీల్ నెగెటివ్ రోల్ లో కనిపించగా వైవా హర్ష కీలక పాత్రలో నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘హృదయ కాలేయం’ సాయిరాజేష్ – లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని నిర్మించారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ‘ఆహా’ తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో ఈ సినిమా విడుదలైంది. స్ట్రీమింగ్ అయిన ఫస్ట్ డే నుంచే ‘కలర్ ఫోటో’ ఓటీటీ ఆడియన్స్ మరియు విమర్శకులు నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీలో విడుదలైన సినిమాలో బెస్ట్ సినిమా అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రానికి ఫిదా అయ్యాడు.

‘కలర్ ఫోటో’ చిత్రాన్ని చూసిన బన్నీ చిత్ర యూనిట్ ని పిలిపించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. హీరో సుహాస్ – హీరోయిన్ చాందిని చౌదరి – దర్శకుడు సందీప్ రాజ్ – హర్ష – మ్యూజిక్ డైరెక్టర్ కాళ భైరవ – స్టోరీ అందించడంతో పాటు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సాయి రాజేష్ కు అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్ చేస్తూ ”కలర్ ఫోటో ఎంటైర్ టీమ్ కి నా అభినందనలు. చాలా మధురమైన ప్రేమకథ & అద్భుతమైన సంగీతం భావోద్వేగాలు మరియు పర్ఫార్మన్స్ లతో వెంటాడే చిత్రం. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది” అని పేర్కొన్నాడు. దీనికి చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. అల్లు అర్జున్ ఈ సినిమా చూసి అభినందించడంతో ‘కలర్ ఫోటో’ చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.