Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీరే

2020లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీరే


2020….సోషల్ మీడియాలో కరోనా నామ సంవత్సరంగా విపరీతమై ట్రోలింగ్ కు గురవుతున్న సంవత్సరం ఇది. సాధారణంగా పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ…కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ప్రతిసారి కొత్త సంవత్సరం ప్రారంభమవడానికి కొద్ది రోజుల ముందే గత ఏడాది జరిగిన మధుర స్మృతులతో పాటు చేదు ఘటనలను గుర్తుకు తెచ్చుకోవడం ఆనవాయితీ. అయితే 2020 విషయంలో మాత్రం….ప్రపంచ దేశాల ప్రజలందరికీ దాదాపుగా చేదు అనుభవాలే మిగిలాయి. ఉరుములు లేని పిడుగులా వచ్చిపడ్డ కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలంతా ఇటు ఆర్థికంగా అటు మానసికంగా కుంగిపోయారు. మన దేశంలోనూ కరోనా ఈ ఏడాది ప్రజలకు ఎన్నో చేదుగుళికలు అందించింది. ఈ ఏడాది కరోనా బారిన పడి కొందరు సినీ ప్రముఖులు మరణించగా….రకరకాల అనారోగ్య కారణాలతో పలువురు సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్(53) ఏప్రిల్ 29న క్యాన్సర్ తో పోరాడి ఓడాడు. విలక్షణ నటుడు ఇర్ఫాన్ మృతితో విషాదంలో మునిగి ఉన్న బాలీవుడ్ ఏప్రిల్ 30న మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. అలనాటి అందాల నటుడు బాలీవుడ్ లెజెండరీ హీరో రిషీ కపూర్(67) లుకేమియాతో ఏప్రిల్ 30న తుది శ్వాస విడిచారు.

2020లో బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) సూసైడ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో నెపోటిజం వర్గపోరు డ్రగ్స్ వంటి పలు కోణాలు సుశాంత్ సూసైడ్ తో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ మిస్టరీపై విచారణ కొనసాగుతోంది. బాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) జూన్ 20న అనారోగ్యంతో మరణించారు. తమిళ నటి వీజే చిత్ర(28) డిసెంబరు 9న ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్ లో కలకలం రేపింది. తెలుగువారితో పాటు దేశం గర్వించదగ్గ ప్రముఖ నేపథ్య గాయకుడు నటుడు బాలసుబ్రహ్మణ్యం(74) కరోనా బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమ ఆరాధ్య గాయకుడు బాలు ఇక లేరన్న సంగతిని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కరోనాబారినపడి చెన్నైలో చికిత్స పొందుతోన్న బాలు…కరోనా నుంచి కోలుకున్నట్లే కోలుకొని మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. అయినప్పటికీ తన గొంతు వినిపించేందుకు బాలు మళ్లీ వస్తారని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు బాలు నిరాశ మిగిల్చి మరలిరాని లోకాలకు తరలి వెళ్లారు. లెజెండరీ సింగర్ బాలు మృతిపట్ల యావత్ భారత దేశం సంతాపం వ్యక్తం చేసింది.