Templates by BIGtheme NET
Home >> Cinema News >> సీసీసీ మూడో విడత సాయం అందిస్తున్నాం : చిరంజీవి

సీసీసీ మూడో విడత సాయం అందిస్తున్నాం : చిరంజీవి


కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. గతంలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రైసిస్ వల్ల సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా రోజువారీ సినీ కార్మికుల దుస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే రెండు విడతలుగా వేలాది మంది సినీ కార్మికులకు సహాయం అందించారు. సీసీసీ ద్వారా మూడో విడుత సహాయం కూడా అందిస్తున్నట్లు చిరంజీవి ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు.

కాగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని’ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ”షూటింగ్ లు ప్రారంభం కాకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అందుకే సీసీసీ తరఫున మూడోసారి కూడా వారికి సహాయం చేస్తున్నాం. వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తున్నాం. ఇప్పటికే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు పదివేల మందికి అందిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులు తాత్కాలికమే. త్వరలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాం. అప్పటివరకు అందరూ ధైర్యంగా ఆరోగ్యంగా ఉండాలి. మనకేం రాదులే అనే నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమతంతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించు కుంటూ మీ కుటుంబానికి రక్షణగా ఉండండి ప్లీజ్. ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించాలని.. యధావిధిగా అందరం పనిచేసుకుని సంతోషంగా ఉండాలని ఆ వినాయకుడిని ప్రార్థించాలి” అని చెప్పారు.