Templates by BIGtheme NET
Home >> Cinema News >> రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!

రంగస్థలం సమస్యలను సీఎం భరత్ కు వినిపిస్తున్న చిట్టిబాబు..!


టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. వయసులో తేడా ఉన్నప్పటికీ వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. సినిమాల విషయంలో పోటీ పడినా నిజ జీవితంలో మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లోనే కాకుండా వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీస్ తో కలిసి ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. షూటింగుల సమయంలో లొకేషన్స్ కి వెళ్లి మరీ ముచ్చటిస్తుంటారు. వీరి భార్యలు నమ్రత శిరోద్కర్ – ఉపాసన కూడా అంతే సన్నిహితంగా మెలుగుతుంటారు. గతంలో ఇద్దరు స్టార్ హీరోలు తమ కుటుంబాలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూశాం. అయితే తాజాగా మహేష్ – చరణ్ లు కలసి ఉన్న ఓ అన్ సీన్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోలో మహేష్ బాబు – రామ్ చరణ్ ఎదురెదురుగా కూర్చొని దేని గురించో తీవ్రంగా చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. హీరో ఆది పినిశెట్టి వీరిని తీక్షణంగా గమనిస్తున్నారు. ఈ ఫోటో ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ సమయంలో తీసినదిగా తెలుస్తోంది. అదే టైంలో మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నారు. చిట్టి బాబు గెటప్ లో చరణ్ కనిపిస్తుండగా.. సిఎం భరత్ వేషధారణలో మహేష్ ని చూడవచ్చు. ‘భరత్ అనే నేను’ ప్రెస్ మీట్ సీన్ లో వేసుకున్న దుస్తుల్లో మహేష్ కనిపిస్తున్నారు. చరణ్ – మహేష్ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రంగస్థలం గ్రామ సమస్యలను సీఎం భరత్ కు చిట్టిబాబు వినిపిస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వీరి బాండింగ్ చూస్తుంటే ఇద్దరూ ఓ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని వారి అభిమానులు అంటున్నారు. మరి భవిష్యత్ లో కలిసి నటిస్తారేమో చూడాలి.

ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో పాటుగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో శంకర్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ ప్రారంభించనున్నారు.