ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ గెటప్ పై వివాదం…!

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రో వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ‘కొమురం భీమ్’ ని పరిచయం చేస్తూ వచ్చిన ‘రామరాజు ఫర్ భీమ్’ కి విశేష స్పందన వచ్చింది. అలానే దీనిపై వివాదం కూడా చెలరేగింది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన రాజమౌళి.. చివర్లలో తారక్ ని ముస్లిం యువకుడిగా చూపించడంపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విప్లవవీరుడు కొమరం భీమ్ నిజాం పాలనకి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని.. చరిత్రను వక్రీకరించి భీమ్ ని ముస్లిం గెటప్ లో చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని.. చరిత్ర ప్రకారం ఎప్పుడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ లు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా నుంచి పుట్టిందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించాడు. అందుకే మరికొందరు మాత్రం రాజమౌళికి మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. రజాకార్లపై తిరుగుబాటు చేసే సమయంలో కొమరం భీమ్ ముస్లింగా మారువేషంలో తిరిగినట్లు చూపిస్తాడేమో అని.. సినిమా రిలీజ్ అవకముందే వివాదం రేపడం తగదని అంటున్నారు. జక్కన్న ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది.. దీని వెనుక స్ట్రాటజీ ఏంటనేది తెలియాలంటే ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కాకపోతే చరిత్రను వక్రీకరిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నవారు అప్పటి వరకు దీనిపై సైలెంటుగా ఉంటారో లేదో చూడాలి.