ఘట్టమనేని క్యాంప్ లో దబాంగ్ బ్యూటీ

0

జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో మహేష్ నిర్మిస్తున్న `మేజర్` చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది? అంటే.. ఇప్పటికే సగం పూర్తయింది. ఒక కథానాయికను ఫైనల్ చేసినా మరో కథానాయికను ఇన్నాళ్లు వెయిట్ చేశారని తెలుస్తోంది. అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తుండగా.. గూఢచారి ఫేం శశికిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. దబాంగ్ 2లో నటించిన సయీ మంజ్రేకర్ ని ఈ మూవీ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది.

సయీ మంజ్రేకర్ నటించిన తొలిసినిమాతోనే యూత్ గుండె కొల్లగొట్టింది. సల్మాన్ లాంటి పెద్ద స్టార్ తో పోటీపడి నటించిందన్న పేరొచ్చింది. ఇక తనదైన అందచందాలు అభినయంతో ఈ అమ్మడు మ్యాజిక్ చేయడంతో అప్పట్లోనే టాలీవుడ్ ఎంట్రీపై చర్చ సాగింది. మహేష్ .. చరణ్ సినిమాల్లో నటించబోతోందని ప్రచారం సాగింది. ఎట్టకేలకు మహేష్ కాంపౌండ్ లోనే ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరం.

`మేజర్` చిత్రంలో సయీ మంజ్రేకర్ ఒక కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. 2008లో 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో అమరవీరుడైన ఎన్.ఎస్.జి కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం స్ఫూర్తితో తెలుగు- హిందీ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న మూవీ ఇది. దేశమంతా ఒకేసారి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఇందులో గూఢచారి ఫేం శోభిత ధుళిపాల ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇదివరకూ 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెలలో హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. 2021 వేసవిలో విడుదల కానుంది. జీఎంబీతో కలిసి ఏ ప్లస్ ఎస్ మూవీస్ – సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తున్నాయి.