హద్దులు దాటిన ఆగ్రహం.. క్వీన్ దిష్టిబొమ్మల్ని తగలెట్టారు

0

వెండితెర మీద నుంచి ప్రజాజీవితం దిశగా అడుగులు వేస్తున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్. తానేదైనా స్టాండ్ తీసుకున్నంతనే చెలరేగిపోయే ఆమె.. అదే తీరును ప్రదర్శిస్తున్నారు. మోడీ ప్రభుత్వ విధానాల్ని సంపూర్ణంగా విశ్వసించటమే కాదు.. విమర్శలు చేసే వారిపై ఘాటుగా రియాక్టు అవుతున్న ఆమె తీరు పలు సందర్భాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

తాజాగా కేంద్రం పాస్ చేసుకున్న వ్యవసాయ బిల్లుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఆగ్రహంతో నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన కంగనా.. వారిని ఉగ్రవాదులతో పోల్చటంపై పలువురు ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. దీంతో.. వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో కంగనా దిష్టి బొమ్మల్ని దగ్థం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

దీనిపై తనదైన శైలిలో స్పందించారు క్వీన్. పంజాబ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తొలుత మహారాష్ట్రలో కాంగ్రెస్ తనను బెదిరించిందని.. తన పోస్టర్లపై చెప్పులు విసిరిందన్నారు. తాజాగా పంజాబ్ తో తన దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారని.. ఇది తనను తప్పుగా అర్థం చేసుకున్న వ్యవహారంగా అభివర్ణించారు.

అసలు నన్నేమనుకుంటున్నారు? నేనేమైనా మంత్రినా.. గొప్ప ప్రతిపక్ష నేతనని అనుకుంటున్నారా? అంటూ ఆమె ప్రశ్నించారు. బాలీవుడ్ లో మాదిరి.. ఏం మాట్లాడినా మాటకు మాట చెప్పి ఊరుకోవటానికి నిరసనకారులు ఏమీ సహనటీనటులు కాదన్న విషయం కంగనా అర్థం చేసుకోవాలి. వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన వారిని తానన్న మాటల్ని మర్చిపోయి.. అవతలవారు అన్న మాటల్నే పట్టుకోవటం తగదంటున్నారు.