ఎన్టీఆర్ బయోపిక్ పై వివాదం.. దొంగలించారంటున్న దేవా కట్ట…!

0

”ప్రస్థానం” డైరెక్టర్ దేవాకట్ట ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ ఫిలిం మేకర్ ని ఉద్దేశిస్తూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ”నేను రాసిన ఓ కథను దొంగలించి సినిమా చేసిన ఓ వ్యక్తి.. దాంతో డిజాస్టర్ ను చవిచూశాడు. కానీ ఈసారి నేను అలా కానివ్వను. 2017లో చంద్రబాబు నాయుడు – వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జీవితాలను ఆధారంగా చేసుకుని వారి మధ్య స్నేహం రాజకీయ వైరం అనే అంశాలతో ఫిక్షనల్ గా ఓ కథను రెడీ చేశాను. 2017లో ఈ కథను బేస్ చేసుకుని పలు వెర్షన్ ను కూడా రెడీ చేసి కాపీ రైట్ చట్టం కింద రిజిష్టర్ చేయిస్తూ వస్తున్నాను. అయితే కొందరు నా ఆలోచనను హైజాక్ చేస్తున్నారు. వాళ్ళు నేను రిజిస్టర్ చేయించిన సీన్స్/థీమ్స్ ను కాపీ చేసి నన్ను లీగల్ గా ప్రొసీడ్ అయ్యేలా చేయరనే అనుకుంటున్నాను. నేను ఈ స్క్రిప్ట్ ను మూడు భాగాలుగా చేశాను. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్ సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాసుకున్నాను. తర్వాత దీన్ని వెబ్ సిరీస్గా మార్చుకున్నాను. మా టీమ్ కొన్ని మేజర్ ఓటీటీలను కలిసి ఈ ఐడియా చెప్పారు. మా లీగల్ టీమ్ ఈ వ్యవహరాన్ని గమనిస్తున్నారు” అని దేవాకట్టా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే దేవా కట్ట ట్వీట్స్ ‘చదరంగం’ వెబ్ సిరీస్ మరియు డైరెక్టర్ రాజ్ గురించి అని ఓ ప్రసార మాధ్యమం ప్రచురించింది. దీనిపై స్పందించిన దేవా కట్ట ”నేను దర్శకుడు రాజ్ గురించో లేదా చదరంగం గురించో మాట్లాడటం లేదు!! నేను 2015 డిసెంబర్ లో విష్ణు ఇందూరితో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చర్చల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను!” అని మరో ట్వీట్ చేసి ఆరోపించడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

కాగా నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ”ఎన్టీఆర్ – కథానాయకుడు” ”ఎన్టీఆర్ – మహానాయకుడు” అనే రెండు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో గతేడాది ప్రారంభంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. ఈ చిత్రాన్ని బాలకృష్ణ – సాయి కొర్రపాటి – విష్ణు ఇందూరి కలిసి నిర్మించారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ‘కథనాయకుడు’ ‘మహానాయకుడు’ విడుదలైన ఇన్ని రోజులకి దేవా కట్ట ట్వీట్స్ తో మరోసారి తేరా మీదకి వచ్చింది. అయితే దేవా కట్ట ఆరోపణలపై ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ”మీ అందరికి దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఓ రీమేక్ సినిమా కోసం 2015 డిసెంబర్ లో దేవా కట్ట ని కలిసాను. అదే సమయంలో బేసిక్ స్క్రీన్ ప్లే తో ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నాను. అయితే దేవ కట్టా ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎలాంటి స్టోరీ చెప్పలేదు” అని విష్ణు ఇందూరి చెప్పుకొచ్చారు. మరి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చోటు చేసుకున్న ఈ వివాదంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.