`దూకుడు` హిందీ రీమేక్.. డిలే అయ్యాక ఏం లాభం?

0

పాత సీసాలో కొత్త సారా పోయడం తప్ప కొత్త కథల్ని వెతకడంలో మేకర్స్ ఫెయిలవుతున్నారా? అంటే అవుననే ప్రూవ్ అవుతోంది. ఓవైపు ప్రముఖ దర్శకులు ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుంటుంటే పాత కథల్నే తిప్పి తీసేవారికి కొదవేమీ లేదు. ఇక ఎప్పుడో 2011 లో రిలీజై బ్లాక్ బస్టర్ అయిన దూకుడు త్వరలో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ రీమేక్ కి ప్లాన్ చేస్తోంది.

హిందీ వెర్షన్ కోసం మహేష్ చేసిన పాత్రను చేయాల్సిందిగా ఓ అగ్ర హీరోని సంప్రదించారట. తాజా సమాచారం ప్రకారం..దూకుడు హిందీ రీమేక్ కి దర్శకత్వం వహించడానికి బాలీవుడ్ చిత్రనిర్మాత అనీస్ బజ్మీ ఖరారయ్యారట. అనీస్ ఇప్పటికే స్క్రిప్ట్ పని ప్రారంభించారు. హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అతను స్క్రీన్ ప్లేలో చెప్పుకోదగ్గ మార్పులు చేస్తున్నారని సమాచారం.

ట్యాలెంటెడ్ అనీస్ బజ్మీకి బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్లే ఉన్నాయి. నో ఎంట్రీ- సింగ్ ఈజ్ కింగ్ – వెల్ కమ్- రెడీ- వెల్ కమ్ బ్యాక్ – ముబారకన్ వంటి అనేక బ్లాక్బస్టర్ చిత్రాల్ని తీసిన అనుభవం ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో `భూల్ భూలయా 2` చేస్తున్నారు. అటు పై దూకుడు రీమేక్ ని సెట్స్ కి తీసుకెళ్లే వీలుందని తెలుస్తోంది. అయితే దూకుడు రిలీజై చాలా కాలం అయ్యాక రీమేక్ చేస్తున్నారు. ఇంత ఆలస్యమైతే ఎలా అనే సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు కొందరు.