దీపికా మేనేజర్ ఇంట్లో డ్రగ్స్.. మరోసారి సమన్లు జారీ చేసిన ఎన్సీబీ..!

0

బాలీవుడ్ లో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసుని విచారిస్తున్న క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు పలువురిని అరెస్ట్ చేసి విచారించారు. దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా బెయిల్ పై విడుదలైంది. ఇదే కేసులో ఎన్సీబీ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే – సారా అలీఖాన్ – రకుల్ ప్రీత్ సింగ్ – శ్రద్ధా కపూర్ లను కూడా విచారించారు. అలానే టాలెంట్ మేనేజర్ జయ సాహా మరియు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కూడా ప్రశ్నించారు. కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరోసారి బాలీవుడ్ డ్రగ్ రాకెట్ పై పంజా విసిరారని తెలుస్తోంది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ముందస్తు సమాచారం మేరకు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో మెరుపు దాడులు చేసారు. ముంబైలోని కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో 1.8 గ్రాముల నిషేధిత మాదక ద్రవ్యాలు లభించినట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖేడే వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో మరోసారి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు ఎన్సీబీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దాడుల తర్వాత ఆమె జాడ కనబడకపోవడంతో.. కరిష్మా ఇంటి తలుపులకు అధికారులు నోటీసు అంటించారు. కాగా పెను సంచలనంగా మారిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ‘ఊపిరి’ ఫేమ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్ సోదరుడుని అరెస్ట్ చేసారు. అలానే నటి సప్నా పబ్బాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు కరిష్మా ప్రకాష్ కు మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు ఇవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.