‘దాడి’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మినిస్టర్ తలసాని…!

0

శ్రీరామ్ – జీవన్ – అక్షర రెడ్డి – గణేష్ వెంకట రమణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ”దాడి”. టి. మధు శోభా దర్శకత్వం వహించారు. శ్రీ కల్పవృక్ష క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్ల శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించాడు. నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి సందర్భంగా ఈ మూవీలోని ‘ఎవరి కోసం’ టైటిల్ సాంగ్ ని తెలంగాణా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ‘గడిచిన యుగాలలో అధర్మంపై ధర్మం దాడి చేస్తే అది లోక కళ్యాణం.. ఆ తర్వాత మనిషిలో ఆలోచన మొదలయ్యాక కుల మతాల మధ్య పరస్పర దాడులు మొదలయ్యాయి. అది అధికార ఆధిపత్యం కోసం. అయితే అప్పటికీ ఇప్పటికీ సాక్ష్యం ఒక్కటే.. కలం” అంటూ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయింది.

”ఏది జీవితం.. ఏది మృత్యువు.. ఏది చీకటి వెలుతురంటూ..నడిచే దారిలో చావు ఉందని తెలిసే రోజు ఎప్పుడంటూ..” సాగిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించాడు. సింగర్ శ్రీకృష్ణ ఆలపించారు. ‘ఎవడు చేసిన పాపమిదిలా.. ఎవరికో శాపమిదిలా.. ఎవడు తీసిన ప్రాణమిదిరా.. ఎవరిపై కోపమో.. ఎవరి కోసం.. ఎందుకోసం.. జరుగుతున్న దాడి రా.. తల్లడిల్లే తల్లి బాధకు కారణం ఏ బిడ్డరా..’ అంటూ సాగిన పాట అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో సీనియర్ నటి సితార – అజయ్ – కమల్ కామరాజ్ లు కూడా కనిపిస్తున్నారు. మణిశర్మ సమకూర్చిన అద్భుతమైన ట్యూన్ కి కాసర్ల శ్యామ్ సాహిత్యం.. శ్రీకృష్ణ గాత్రం తోడై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.