గోన గన్నారెడ్డి కోసం గుణ ప్రయత్నాలు

0

ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ‘రుద్రమదేవి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఆయన తదుపరి చిత్రాన్ని విడుదల చేసింది లేదు. మూడు నాలుగు సంవత్సరాల క్రితం గుణ శేఖర్ హిరణ్య కశ్యప చిత్రాన్ని ప్రకటించాడు. ఆ సమయంలోనే సినిమాలో రానా నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. వచ్చే యేడాది ఖచ్చితంగా సినిమాను పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో గుణశేఖర్ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు.

ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు మరో హీరో కోసం చర్చలు జరుపుతున్నాడట. తన రుద్రమదేవి చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించిన అల్లు అర్జున్ ను హిరణ్య కశ్యప చిత్రం కోసం సంప్రదిస్తున్నాడట. అల్లు అర్జున్ కోసం ఒక ప్రత్యేకమైన పాత్ర ను ఈ సినిమాలో గుణశేఖర్ అనుకున్నాడట. ఆ పాత్ర చేస్తే మళ్లీ బన్నీకి మంచి గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకంను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాడట.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ‘హిరణ్యకశ్యప’ చిత్రానికి ఓకే చెప్తాడా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గుణశేఖర్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆయన మరీ ఎక్కువ కాలం టైం కేటాయిస్తున్న నేపథ్యంలో అందరిలో చర్చనీయాంశంగా ఉంది. గెస్ట్ రోల్ లోనే కనుక బన్నీ మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్తాడో చూడాలి.