గుణశేఖర్ ‘శాకుంతలం’ మోషన్ పోస్టర్…!

0

తెలుగు ప్రేక్షకులకు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఇతిహాస పౌరాణిక చారిత్రక నేపథ్యం గల చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే గుణశేఖర్.. ‘రామాయణం’ ‘రుద్రమదేవి’ సినిమాలను వెండితెరపై ఆవిష్కరించారు. భారీ సెట్స్ భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమా తర్వాత మరో సినిమా పట్టాలెక్కించలేదు. అయితే దగ్గుబాటి రానా తో మైథలాజీకల్ డ్రామా నేపథ్యంలో ‘హిరణ్యకశ్యప’ అనే చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గత మూడేళ్ల నుంచి జరుగుతున్నాయి. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయినట్లు గుణశేఖర్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన ‘హిరణ్యకశ్యప’ కంటే ముందే గుణశేఖర్ మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం 7.11 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించిన గుణశేఖర్.. తాజాగా ”శాకుంతలం” అనే సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ”వెండితెరపై ‘హిరణ్యకశ్యప’ లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను” అని ట్వీట్ చేసాడు గుణ శేఖర్. అంతేకాకుండా ”శాకుంతలం” మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘మరచిపోయిన ప్రేమ.. మరచిపోలేని ప్రేమ కథ’ అని మోషన్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే సినిమా టైటిల్ కేవలం ఇంగ్లీష్ లోనే రిలీజ్ చేయడం గమనార్హం. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ లో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సంగీత బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.