కుమారి కెరీర్ ని చేతులారా నాశనం చేసుకుంటోందా…?

0

టాలీవుడ్ కి ‘అలా ఎలా’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది హెబ్బా పటేల్. ఫస్ట్ సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినా.. ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో కుర్రకారు హృదయాల్లో చిన్నపాటి అలజడి రేపింది హెబ్బా. యూత్ కి కనెక్ట్ అయ్యే అందం సొంతం చేసుకున్న హెబ్బాకు ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కానీ హెబ్బా తన కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ట్రాక్ తప్పి వరుసగా ఫెయిల్యూర్స్ పలకరించాయి. ‘ఈడో రకం వాడో రకం’ ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ ‘మిస్టర్’ ‘అంధగాడు’ ‘ఏంజల్’ ’24 కిస్సెస్’ వంటి సినిమాల్లో నటించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో అమ్మడికి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

ఈ నేపథ్యంలో నితిన్ – రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాలో హెబ్బా పటేల్ నటిస్తోందని వార్తలు వచ్చాయి. హెబ్బా మంచి ఆఫర్ కొట్టేసింది.. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే సినిమా హిట్ అయింది. కానీ హెబ్బాకి ఒరిగిందేమీ లేదు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమెది అసలు ప్రాధాన్యంలేని క్యారక్టర్. ఇలాంటి రోల్ చేయడానికి ఎలా అంగీకరించిందనే కామెంట్స్ కూడా వచ్చాయి. రెమ్యూనరేషన్ కోసమే ఏమాత్రం గుర్తింపు దక్కని పాత్రల్లో నటిస్తోందా అనే అనుమానాలు కలిగాయి. ఈ క్రమంలో నిన్న ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలో కనిపించింది హెబ్బా.

రాజ్ తరుణ్ – మాళవిక అయ్యర్ హీరో హీరోన్లుగా నటించిన ఈ సినిమాలో హెబ్బా రోల్ చాలా సిల్లీగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే అవసరాల కోసం అబ్బాయిలను వాడుకునే అమ్మాయి పాత్ర అది. ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నవారు హెబ్బాను చూసి.. ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇటీవల వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టిన హెబ్బా పటేల్.. వాటి మీదే ఫోకస్ పెడితే మంచిందని.. లేకపోతే దుకాణం సర్దేయాల్సి వస్తుందని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ లో నటిస్తోంది. ఇదైనా హెబ్బాకి మంచి పేరు తీసుకొస్తుందేమో చూడాలి.