డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజన అరెస్ట్…!

0

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. బాలీవుడ్ లో మొదలైన డ్రగ్స్ మాఫియా వ్యవహారం శాండల్ వుడ్ కు పాకింది. ఇప్పటికే శాండిల్ వుడ్ లో డ్రగ్స్ మాఫియాపై విచారణ చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు హీరోయిన్ రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేసారు. డ్రగ్స్ వ్యవహారంతో ఎవరెవరికి లింకులు ఉన్నాయన్న విషయంపై విచారణను వేగవంతం చేసిన సీసీబీ పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ సంజన గల్రానీని కూడా అరెస్ట్ చేశారు. సంజన ఈవెంట్ మేనేజర్ ప్రీతం శెట్టి ఇచ్చిన సమాచారంతో ఆమె ఇంట్లో సీసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలకమైన ఆధారాలు దొరకడంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే సంజన స్నేహితుడైన రియల్టర్ రాహుల్ ను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి సంజనకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాతో రాహుల్ కు సంబంధాలున్నట్లు విచారణలో తేల్చారు. అయితే రాహుల్ అరెస్ట్ అయిన తర్వాత సంజన పై వచ్చిన విమర్శలపై ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది. తనకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు లేవని.. సినీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగిపై సంజన విరుచుకుపడింది. అయితే ఇప్పుడు సంజన ని కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. సంజన గల్రానీ తెలుగులో ‘బుజ్జిగాడు’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.