Templates by BIGtheme NET
Home >> Cinema News >> హృతిక్ రోషన్ టైటిల్ తో వస్తున్న నాగశౌర్య..?

హృతిక్ రోషన్ టైటిల్ తో వస్తున్న నాగశౌర్య..?


టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఆర్చరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. శౌర్య కెరీర్లో 20వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి ‘సుబ్రమణ్యపురం’ ఫేమ్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ – పుష్కర్ రామ్మోహన్ రావు – శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన #NS20 ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

#NS20 చిత్రానికి ‘లక్ష్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్చరీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి ముందుగా ‘పార్థు’ ‘అర్జున’ అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ.. చివరకు ‘లక్ష్య’ అనే టైటిల్ కే చిత్ర యూనిట్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ తో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. యాక్షన్ హీరో గోపీచంద్ సైతం ‘లక్ష్యం’ అనే టైటిల్ తో మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఇదే క్రమంలో శౌర్య కూడా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శౌర్య కి జోడీగా కేతిక శర్మ నటిస్తోంది.