అమ్మడికి ఇకపై తెలుగులో ఆఫర్స్ రావడం కష్టమేనా…?

0

ఇతర సినీ ఇండస్ట్రీలలో తమ టాలెంట్ ను నిరూపించుకొని తిరిగి టాలీవుడ్ కు వచ్చిన తెలుగు మూలాలున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అదితీరావు హైదరి ఒకరు. ‘ప్రజాపతి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అదితి.. ‘ఢిల్లీ 6’ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ‘యా శాలి జిందగీ’ ‘రాక్ స్టార్’ ‘కూబ్సూరత్’ ‘వాజిర్’ ‘భూమి’ ‘పద్మావత్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా నటించిన ‘సమ్మోహనం’ వంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది హైదరీ. ఆ తర్వాత వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ మరియు మణిరత్నం దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం ‘నవాబ్’ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. లేటెస్టుగా అదితిరావు హైదరీ నటించిన ‘వి’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని – సుధీర్ బాబు – నివేదా థామస్ ఇతర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

కాగా ‘వి’ సినిమాలో అదితిరావు హైదరీ నాని కి జోడీగా కనిపించింది. ముందు నుంచి అదితి పాత్రను సీక్రెట్ గా ఉంచుతూ వచ్చిన చిత్ర యూనిట్ ‘వి’ సినిమా స్ట్రీమింగ్ అయ్యేరోజు ఆమె లుక్ రివీల్ చేసింది. హైదరీ క్యారెక్టర్ కి ఏదో ట్విస్ట్ ఉంది.. అందుకే ఆమె పాత్రను గోప్యంగా ఉంచుతూ వచ్చారని భావించిన ఆడియన్స్.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక హైదరీ పాత్ర తేలిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ‘వి’ సినిమా నడవడానికి ప్రధాన కారణమైన ఆమె పాత్ర అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందని అందరూ డిజప్పాయింట్ అయ్యారు. ఇక మత్తెక్కించే అందంతో ఆడియన్స్ ని ఫిదా చేస్తుందనే పేరున్న హైదరీ లుక్స్ కి పెద్దగా స్పందన రావడంలేదు. దీంతో తన పాత్ర కోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకున్నప్పటికీ సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్ల అదితి కెరీర్ కి మైనస్ గా మిగిలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇకపై తెలుగులో ఆఫర్స్ రావడం కష్టమేనని.. బాలీవుడ్ లో కాస్త అడల్ట్ టచ్ ఉన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇక్కడ కూడా అదే రీతిన సినిమాలు చేస్తానంటే తెలుగు సినీజనాలు ఆలోచిస్తారేమో అని అంటున్నారు. ఏదేమైనా రచ్చ గెలిచి ఇంట గెలవాలని ప్లాన్స్ వేసుకున్న అదితిరావు హైదరీ కి ‘వి’ సినిమా పెద్ద దెబ్బ కొట్టిందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.