సమంతా ‘సామ్ జామ్’ ఫ్లాప్ షోగా మారిందా?

0

అక్కినేని వారి కోడలు సమంత ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో తనకిష్టమైన వ్యాపాకాలతో సేదతీరుతోంది. అలాగే ఆదాయమార్గాలను వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ‘ఆహా’ ఓటీటీలో ‘సామ్ జామ్’ పేరుతో నిర్వహించిన ఆమె ప్రోగ్రాం ప్రోమో చూసి అందరూ ఎంతో ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ షో ప్రచారం అయ్యాక తెలిసింది. అది అన్ని టీవీ షోలను కలిపికొట్టిన కిచిడీ షో అని.. దీంతో నెటిజన్లు అప్పుడే ‘సమంత.. ఏంటమ్మా’ ఇది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సమంత తన కొత్త షో కోసం ఎలాంటి వినూత్న ప్రయత్నాలు చేయలేదని..ఎలాంటి సన్నాహాలు చేయలేక పోయిందని షో చూశాక జనాలకు అర్థమైంది. డిజైన్ కంటెంట్ మరియు నాణ్యతను సాధ్యమైనంత క్రియేటివిటీగా చేయాల్సి ఉండగా అవేవీ లేకుండా షో తేలిపోయిందంటున్నారు. “ఆహా” బృందం కూడా దీన్ని విస్మరించినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రదర్శనను విజయవంతం చేయడానికి సమంత ఒక్కరే సరిపోదని తేటతెల్లమైంది.

‘ఆహా’ ఓటీటీలో హోస్ట్గా సమంత ‘సామ్-జామ్’ పేరుతో ఒక షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షో కొత్తదనంతో నిండిపోతుందని చాలామంది ఊహించారు. కానీ అందరిని నిరాశకు గురిచేస్తూ ఈ కార్యక్రమం అన్ని తెలుగు టీవీషోలను కాపీ కొట్టిన సాధారణ చాట్ షోగా ముగిసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వివరంగా చెప్పాలంటే ఇది “బతుకు జట్కా బండి” “అలీతో సరదగా”.. యాంకర్ సుమ “క్యాష్” షోల కలయికగా కనిపిస్తుందని చెబుతున్నారు..

సమంత షోలో మొదట ఒక సినీ ప్రముఖుడితో చిట్ చాట్ నిర్వహించారు. అది జరుగుతుండగా అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి మనస్తత్వవేత్త మరియు వైద్యుడిని తీసుకువచ్చారు. అప్పుడు ఒక పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకువచ్చి వారిని మాట్లాడేలా చేశారు. అక్కడితో ఆగకుండా షోలో వివా హర్ష అనే హాస్యనటుడిను ఇన్ వాల్వ్ చేసి హల్ చల్ చేశారు.

ఈ షో దేనికోసం చేస్తున్నారో.. ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియక రుచిలేని చెడు వంటకంగా మార్చేశారు.. మేకర్స్ అతిగా ఆశించడంతో ఇది ఫ్లాప్ షోగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పేలవమైన ప్రదర్శనలకు సంతకం చేసే ముందు సమంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ ప్రదర్శన తరువాతి ఎపిసోడ్లు అయితే కాసింత క్రియేటివిటీ జోడించాలని పలువురు కోరుతున్నారు.