చేతులు కాలాక ఆకులు పట్టుకోవద్దని బాగా చెప్పారు!

0

మహమ్మారీ ప్రతి ఒక్కరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే మొండితనం మహమ్మారీకేనా? మనుషులకు లేదా? అంటే ఇప్పుడు సీన్ అంతా రివర్సులోనే ఉంది మరి. ఇంతకుముందులా వైరస్ కి ఎవరూ భయపడడం లేదని రోడ్లపై తాజా సన్నివేశం చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయి తిరిగేస్తున్నారంతా.

అలాగే షూటింగులతో ఇప్పటికే టాలీవుడ్ లో కళ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ అదరక బెదరక షూటింగులు మొదలెట్టేస్తున్నారు. అయితే భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు. మరోవైపు థియేటర్లు తెరిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇక ఓ ఇద్దరు సెలబ్రిటీలు తాజా సన్నివేశాన్ని కాస్త వినోదాత్మకంగా వివరించి చెప్పారు. నేను రిటైర్ అయిపోతున్నా అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. ఉన్నట్టుండి అభిమానులకు షాక్ నిచ్చింది. కానీ తాను రాసిన సోషల్ మీడియా వ్యాసం చదివాక మాత్రం అసలు విషయం అర్థమైంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో భయం నుంచి తాను విరమించాలనుకుంటున్నానని .. మళ్లీ ఆటలోకి జనవరిలో పునరాగమనం చేస్తున్నానని సింధు తెలిపింది. కాస్త డొంక తిరుగుడుగా చెప్పడంతో జనానికి విషయం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అర్థం కాలేదు.

తాజాగా చందమామ కాజల్ కూడా ఇదే తీరుగా వ్యవహరించడం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ‘ఇట్స్ నెవర్ టూ లేట్.. ఐ సే నో’ అని సోషల్ మీడియాలో బోల్డ్ మెసేజ్ పెట్టడంతో ఏమిటో ఇది అనుకున్నారంతా. కరోనా అంటించుకుని తర్వాత బాధ పడేకంటే ముందే జాగ్రత్తగా ఉండాలని కాజల్ బోల్డ్ స్టేట్ మెంట్ మీనింగ్ ఆ తర్వాత అర్థమైంది. కొన్నిటికి నో చెప్పాలంటే మొహమాట పడాల్సిన పనే లేదని కాజల్ ఈ సుదీర్ఘ లేఖలో సూటిగా వివరించింది. అంతేనా హడావుడిగా తిరిగేస్తున్న జనాన్ని అప్రమత్తంగా ఉండమని సూచించింది కాజల్. వైరస్ కు దీటైన బదులివ్వడానికి అందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేయాలని ఆమె అంది. కొత్త జీవితంలో అడుగు పెడుతున్న తాను పాత విధానం వదిలి కొత్త జాగ్రత్తలు పాటిస్తానని కూడా కాజల్ వెల్లడించింది.

గౌతమ్ కిచ్లుని పెళ్లాడాక కాజల్ ఎమోషనల్ ఇన్ స్టా పోస్టులు అభిమానుల్లో వైరల్ గా మారుతున్న సంగతి తెలిసినదే. సింధు.. కాజల్ తరహాలోనే ఇతర సెలబ్రిటీలు కరోనాకు భయపడొద్దని జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా చేతులు కాలాక ఆకులు పట్టుకునే విధానం సరికాదని మంచి మాటనే చెబుతున్నారు.