అది ఫేక్ లిప్ లాక్ అని తేల్చేసిన కాజల్

0

బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్స్ ఎప్పట్నుంచో సాధారణం అయిపోయాయి. సౌత్ సినిమాల్లో కూడా గతంతో పోలిస్తే లిప్ లాక్ సీన్లు పెరిగాయి కానీ.. ఇప్పటికీ విరివిగా అయితే కనిపించవు. స్టార్ హీరోలు హీరోయిన్లు లిప్ లాక్స్ విషయంలో కొంచెం హద్దుల్లోనే ఉంటారు. తెరపై ఘాటు రొమాన్స్ చేయడానికి ఇష్టపడని హీరోల్లో సూర్య ఒకడు. అలాంటి సన్నివేశాలు అతడి సినిమాల్లో తక్కువగా కనిపిస్తాయి. ఐతే కొన్నేళ్ల కిందట అతను నటించిన ‘బ్రదర్స్’ సినిమాలో హీరోయిన్ కాజల్తో సూర్య లిప్ లాక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సూర్య ఎలా ఒప్పుకున్నాడని సందేహం కలిగింది. కాజల్కైతే వేరే సినిమాల్లో లిప్ లాక్స్ చేసిన అనుభవం ఉంది. ఐతే సూర్యతో ఆమె చేసింది మాత్రం నిజమైన లిప్ లాక్ కాదట. దాని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు సీక్రెట్ బయటపెట్టింది కాజల్.

లిప్ లాక్ సీన్ గురించి దర్శకుడు కె.వి.ఆనంద్ చెప్పినపుడు తాను కానీ సూర్య కానీ అది చేయడానికి సుముఖంగా లేమని కాజల్ చెప్పింది. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా కనిపించాడని.. కానీ ఆ సన్నివేశంలో సినిమాకు చాలా కీలకం కావడంతో దర్శకుడు అందుకోసం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించింది. ముందుగా బ్లూ మ్యాట్ ముందు సూర్యను కుర్చీలో కూర్చోబెట్టి ఒక గ్లాస్పై ముద్దు పెట్టించాడని.. ఆ తర్వాత తనను కూడా మరో యాంగిల్లో కూర్చోబెట్టి ఒక బొమ్మ మీద ముద్దు పెట్టించారని.. ఈ రెండు సన్నివేశాలను విజువల్ ఎఫెక్ట్స్ టీంకు అప్పగిస్తే వాళ్లు తామిద్దరం లిప్ లాక్ చేసినట్లుగా సన్నివేశాన్ని మార్చారని.. తెరమీద చూస్తే అది ఒరిజినల్ లిప్ లాక్ లాగా అనిపిస్తుందని కాజల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘బ్రదర్స్’ సినిమాలో సూర్య అవిభక్త కవలల పాత్రలు చేశాడు. అందులో ఒకడు బాగా అల్లరోడు. తన సోదరుడు కాజల్ను ప్రేమిస్తున్నాడని తెలిసి.. అతనే థియేటర్లో ఇద్దరూ లిప్ లాక్ చేసుకునేలా సెట్ చేస్తాడు.