‘బుల్లీవుడ్’ అంటూ కంగన సంచలన ట్వీట్…!

0

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముంబై పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తలపిస్తోందంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకు మధ్య వివాదం కొనసాగుతోంది. కంగనాకు ముంబైలో అడుగు పెట్టనివ్వబోమని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో నేను ముంబై వస్తున్నానని దమ్ముంటే అడ్డుకోమని ఛాలెంజ్ చేసింది కంగనా. ఈ క్రమంలో కంగనా తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి బయలుదేరింది. అయితే ఇదే సమయంలో బీఎంసీ అధికారులు కంగనా మణికర్ణిక కార్యాలయ కూల్చివేత ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ కూల్చివేత గురించి తెలుసుకున్న కంగనా మరోసారి తీవ్రంగా స్పందించింది. ‘మహారాష్ట్ర ప్రభుత్వం గూండాలు ముంబైలో తన ఆస్తులపై విధ్వంసానికి తెగబడ్డారని.. కానీ మహారాష్ట్ర కోసం తన రక్తాన్ని ధారపోసేందుకైనా రెడీ అని.. తన స్పిరిట్ ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయికి వెళ్తూనే ఉంటుందని’ ట్వీట్ చేసింది.

అంతేకాకుండా ‘నేను ఎప్పుడూ తప్పు కాదని నా శత్రువులు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు. నా ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా మారిపోయింది’ అని కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ముంబైలోని తన ఆఫీసును బీఎంసీ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. డెత్ ఆఫ్ డెమోక్రసీ అనే హ్యాష్ ట్యాగ్ తో ‘పాకిస్తాన్’ ‘బార్బర్.. అతని సైన్యం’ అని కామెంట్స్ పోస్ట్ చేసింది. ”నా ఇంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణం లేదు. సెప్టెంబర్ 30 వరకు కోవిడ్ లో కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించింది. బుల్లీవుడ్ ఇప్పుడు చూడండి ఇదే ఫాసిజం లాగా ఉంది” అని మరో ట్వీట్ చేసింది.