క్రిష్ ఫొటో షేర్ చేసిన కంగనా

0

బాలీవుడ్ వివాదాల రాణి కంగనా రనౌత్కు మన స్టార్ డైరెక్టర్ క్రిష్కు మధ్య గత ఏడాది ఎంత పెద్ద గొడవైందో అందరికీ తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో ‘మణికర్ణిక’ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎన్నో అంచనాల మధ్య మొదలుపెట్టి పూర్తి చేశాడు శంకర్. కానీ చివరి దశలో ఆమెతో ఆయనకు చెడింది. క్రిష్ తీసిన సన్నివేశాలు నచ్చక స్వీయ దర్శకత్వంలో రీషూట్లు మొదలుపెట్టింది కంగనా. ముందు దర్శకుడిగా క్రిష్ పేరే ప్రోమోల్లో కనిపించినా.. ఆ తర్వాత దర్శకురాలిగా కంగనా సైతం క్రెడిట్ తీసుకుంది. ఐతే రిలీజ్ ముంగిట ఈ విషయమై క్రిష్ తీవ్ర అభ్యంతరాలే వ్యక్తం చేశాడు. తన నుంచి క్రెడిట్ లాక్కోవడానికి ప్రయత్నించడం అలాగే తన ప్రమేయం లేకుండా కథ సన్నివేశాలను ఎలా పడితే అలా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై కంగనాకు క్రిష్కు మధ్య మాటల యుద్ధం కూడా సాగింది.

ఐతే ఆ సినిమా విడుదల తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడే పరిస్థితి లేదు. ఐతే ఒకసారి ఓ వ్యక్తిని టార్గెట్ చేసిందంటే.. వాళ్లను అంత తేలిగ్గా వదలదు కంగనా. వాళ్ల పట్ల తన ద్వేషాన్ని చూపిస్తూనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అనుకోకుండా ట్విట్టర్లో కంగనా.. క్రిష్ ఉన్న ఒక ఫొటోను షేర్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. ‘మణికర్ణిక’ నిర్మాతల్లో ఒకరైన కమల్ జైన్కు ఆదివారం పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆయనతో ఉన్న ఫొటోలు కొన్ని షేర్ చేసింది కంగనా. వాటిలో ఒక ఫొటోలో క్రిష్ సైతం ఉన్నాడు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చిత్ర బృందం వారణాసిలో నిర్వహించింది. ఈ సందర్భంగా గంగా నదిలో చిత్ర బృందమంతా పడవలో ప్రయాణించింది. ఆ పడవలో క్రిష్తో పాటు రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం ఉన్నాడు. ఐతే ఇగోకు పోకుండా క్రిష్ను కట్ చేయకుండా అతనున్న ఫొటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కంగనా. సందర్భం సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కంగనా ట్విట్టర్ పోస్టులో క్రిష్ కనిపించడం మాత్రం చర్చనీయాంశమైంది.